ఈఎస్‌ఐ ఆస్పత్రి ఇంకెన్నాళ్లకు?

26 Jan, 2014 23:25 IST|Sakshi

తాండూరు, న్యూస్‌లైన్:  వేలాదిమంది కార్మికులు వైద్యసేవల కోసం అల్లాడుతున్నారు. అందుబాటులో కార్మిక బీమా ఆస్పత్రి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక నిస్సహాయంగా గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్న తాండూరు ప్రాంతంలో కార్మికులకు వైద్యసేవలు అందని ద్రాక్షగా మారాయి. తాండూరు అంటే గుర్తొచ్చేది జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన షాబాద్ (నాపరాతి) బండలు. వందలాది నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

ఇవి కాకుండా మరో నాలుగు పెద్ద సిమెంట్ కర్మాగారాలూ తాండూరులో ఉన్నాయి. నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలతో బీడీల పరిశ్రమ, భవన నిర్మాణం తదితర రంగాల్లో సుమారు 15-20వేల మంది వరకూ కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో సుమారు 5వేలమంది కార్మికులు ఉంటే కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటు చేయాలి.

 కానీ తాండూరులో సంఘటిత, అసంఘటిత రంగాల్లో వేలాదిగా కార్మికులు పనిచేస్తున్నా కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటుకు నోచుకోవడం లేదు. ఆయా రంగాల నుంచి సర్కారుకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఈ ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి లేకపోవడం గమనార్హం.

 పలుమార్లు తాండూరులో పర్యటించి కార్మికుల వివరాలు సేకరించిన ఆ శాఖ అధికారులు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పదేళ్లుగా హామీలు ఇవ్వడమే తప్ప ఇంతవరకూ ఆస్పత్రి అతీగతి లేదు. దీంతో గనులు, నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లలో ప్రమాదాలకు గురవుతున్న కార్మికులు మృత్యువాత పడుతుండగా, పలువురు అంగవైకల్యానికి గురవుతున్నారు. జబ్బులు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక జీవితాలను వెళ్లదీస్తున్నారు. తాండూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌కు గతంలోనే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి విన్నవించారు.

 తాండూరు మండలంలోని చెన్‌గేష్‌పూర్ లేదా మల్కాపూర్ నుంచి గౌతాపూర్ మార్గంలో కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదించారు. సుమారు 5ఎకరాల స్థలం ఇందుకు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయినా ఈ విషయంలో పురోగతి లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైనా కార్మికులకు వైద్య సేవలందించాలని పలు కార్మిక సంఘాల నాయకులు కార్మిక శాఖ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా చలనం లేని రాష్ట్ర సర్కార్
 స్థానిక కార్మిక సంఘాల నాయకులు 2012 సంవత్సరంలో అప్పటి కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున ఖర్గేను కలిసి ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు కోసం వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని సీసీఐ కార్మిక సంఘం నాయకుడు శరణు చెప్పారు. అయితే స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈఎస్‌ఐ ఆస్పత్రి అటకెక్కింది.

మరిన్ని వార్తలు