బస్సులో బంగారు నగల పర్సు చోరీ

17 Apr, 2015 02:39 IST|Sakshi

పి.గన్నవరం :ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ వద్ద ఉన్న పర్సు చోరీకి గురైంది. ఆ పర్సులో రూ.రెండు లక్షల విలువైన నగలు ఉండటంతో బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మైలా లక్ష్మీప్రసన్నాంబ మనవరాలు జాహ్నవితో కలిసి ఎల్.గన్నవరంలోని తన అల్లుడి ఇంటికి బస్సులో వస్తున్నారు.  రావులపాలెం వరకు ఒక బస్సులో వచ్చి అక్కడ దిగి హోటల్‌లో భోజనం చేసి ఎల్.గన్నవరం బస్సు ఎక్కారు. ఆమె వద్ద ఉన్న బ్యాగ్‌లో పర్సు పెట్టుకున్నారు. ఆ పర్సులో నాలుగు కాసుల నల్లపూసల దండ, నాలుగు గాజులు, రెండు ఉంగరాలు, కొంత నగదు ఉన్నాయి.
 
 బస్సు ఎక్కిన తరువాత టికెట్టు తీసేందుకు బ్యాగ్‌లోని పర్సుకోసం వెతగ్గా కనిపించలేదు. అప్పటికే ఆ పర్సు చోరీకి గురైనట్టు గమనించారు. తోటి ప్రయాణికులు అక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది. బస్సు పి.గన్నవరం రాగానే బస్సులోని ప్రయాణికులను పోలీసులు తనిఖీలు చేశారు. అయినా పర్సు కనిపించలేదు. రావులపాలెంలోని హోటల్‌కు వెళ్లినప్పుడు లేదా బస్సు ఎక్కినప్పుడు ఆగంతకులు పర్సు దొంగిలించారేమోనని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పి.గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చోరీ జరిగింది రావులపాలెంలో కనుక అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించడంతో బాధితురాలు రావులపాలెం వెళ్లి ఫిర్యాదు చేశారు. మొత్తం బంగారు నగల విలువ రూ.2లక్షలు ఉంటుందని బాధితురాలు చెప్పారు.
 

మరిన్ని వార్తలు