శివశివా.. నాగపడగలెట్టా ?

16 Jun, 2014 03:55 IST|Sakshi
శివశివా.. నాగపడగలెట్టా ?
  •     నాలుగు రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు
  •      రూ.100 కోట్ల వెండి కరిగింపునకు బ్రేక్
  •      రాహుకేతు పూజలెలా చేయూలి?
  •      కొత్త ఈవోకు తొలిరోజే ఇక్కట్లు
  •  శ్రీకాళహస్తి: దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంలో నాగపడగల కొరత తీరేలా లేదు. దీంతో ఆలయాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాహుకేతు పూజలకు వినియోగించే నాగపడగలు ఇక నాలుగు రోజులకు (75కేజీలు) సరిపడేంత మాత్రమే ఉన్నాయి. దీంతో అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆదేశాలను ధిక్కరించలేక.. ఇటు నాగపడగలను రాహుకేతు పూజలకు ఎలా అందించాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు.

    శ్రీకాళహస్తీశ్వరాలయంలో సుమారు రూ. 100 కోట్ల వెండి నిల్వలు ఉన్నాయి. కాగా వారం రోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న ముక్తేశ్వరరావు ముక్కంటి ఆలయంలోని 16 టన్నుల వెండి నిల్వలను హైదరాబాద్‌లో కరిగించాలని, నాగపడగల అవసరాలు, ఆలయంలో ఉత్సవ వాహనాల మరమ్మతులు, నూతన ఉత్సవ వాహనాల ఏర్పాటుకు పోగా మిగిలిన వెండిని విక్రయించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.

    దీంతో రెండు రోజుల క్రితం ఈవోగా ఉన్న రామచంద్రారెడ్డి  నిల్వ ఉన్న వెండిని హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఆయన బదిలీ అయ్యారు. తిరుపతి ఆర్జేసీగా పని చేస్తున్న శ్రీనివాసరావు ఆదివారం నూతన ఈవో గా బాధ్యతలు చేపట్టారు. కాగా వారం క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యలు చేపట్టిన అనురాధ ఆలయంలోని వెండి నిల్వల్లో ఒక్క కేజీని కూడా కరిగించరాదని, ఆలానే ఉంచాలని శనివారం రాత్రి ఉత్తర్వులు పంపారు. దీంతో రూ.100 కోట్ల వెండి నిల్వలకు బ్రేక్ పడింది.

    అయితే వెండిని కరిగించి నాగపడగలు తయారు చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఆలయంలోని మింట్‌లో లేవు. హైదరాబాద్‌లో వెండిని కరిగించి ముద్దలు చేసి ఆలయానికి తీసుకు వస్తే స్థానికంగా ఉన్న మింట్‌లో నాగపడగలు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండి కాకపోయినా కనీసం నాగపడగలకు అవసరమైన వెండినైనా హైదరాబాద్‌లో కరిగించడానికి దేవాదాయశాఖ అనుమతి ఇస్తే నాగపడగల కొరత తీరుతుంది. అయితే ఒక్క కేజీ కూడా కరిగించరాదని ఆదేశాలు ఇవ్వడంతో రాహుకేతు పూజలకు నాగపడగల ఇక్కట్లు తప్పేలా లేవు.
     
    నాగపడగలకు సమయం ఇలా..
     
    ప్రతి ఆరు నెలలకు ఓసారి ఆలయాధికారులు 2500 కేజీల వెండిని హైదరాబాద్‌లోని మింట్‌లో కరిగిస్తారు. అక్కడి నుంచి వెండి ముద్దలను ఆలయానికి తీసుకువస్తే ఇక్కడ నాగపడగలు తయారు చేస్తారు. హైదరాబాద్‌లోని మింట్‌లో రోజుకు 700 నుంచి 800 కేజీల వెండిని మాత్రమే కరిగించడానికి అవకాశం ఉంది. ఈ లెక్కన 2500 కే జీల కరిగింపునకు మూడు రోజుల సమయం పడుతుంది. ఇక ఆ వెండి ముద్దలను నాగపడగలుగా చేయడానికి ఆలయంలోని మింట్‌లో మరో మూడు రోజులు పడుతుంది.

    అలాగే హైదరాబాద్‌కు తీసుకు పోవడానికి ఒక్కరోజు, కరిగించిన ముద్దలను శ్రీకాళహస్తికి తీసుకురావడానికి మరో రోజు సమయం పడుతుంది. మొత్తం మీద ఎనిమిది రోజుల సమయం కావాల్సి ఉంది. అయితే ఆలయంలో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే నాగపడగలు ఉన్నాయి. దీంతో నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ఆదివారం నాగపడగలకు అవసరమైన వెండి కరిగింపునకు అనుమతి ఇవ్వాలని పదేపదే దేవాదాయశాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించారు.  
     
    ఆలయ ఈవోలను కాపాడడం కోసమేనా?
     
    ఆలయంలోని వెండిని కరిగించరాదనే ఆదేశాలు గతంలో ఈవోలను కాపాడడం కోసమేనా? అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఆలయంలో పదేళ్లుగా రూ.100 కోట్ల వెండి నిల్వలు ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన పలువురు ఈవోలు నిల్వ ఉన్న వెండిని కరిగించి నాగపడగలు చేయకుండా చెన్నైలో నాగపడగలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

    వెండి కొనుగోలుపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నాగపడగల తయారీలో వెండిశాతం 90 నుంచి 95 శాతం ఉంటేనే వినియోగించాల్సి ఉంది. ప్రస్తుతం మింట్‌లో తయారు చేస్తున్న నాగపడగల్లోనూ అదే నియమాలు (90-95 శాతం వెండి) పాటిస్తున్నారు. అయితే చెన్నైలో భారీ మొత్తంలో అప్పట్లో పలువురు ఈవోలు కొనుగోలు చేసిన వెండిలో 60 నుంచి 65శాతం మాత్రమే వెండి ఉండేలా కోనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని ఈవోలు నోక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి.

    కాగా ప్రస్తుతం ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండిని కరిగిస్తే సంవత్సరాల వారీగా ఈవోలు కొనుగోలు చేసిన నాగపడగల్లో వెండి శాతం బయటపడుతుంది. దీంతో ఈవోలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఉద్దేశంతో దేవాదాయ శాఖాధికారులు వెండిని కరిగించకుండా నిలుపుదల చేశారని తెలుస్తోంది. రూ.100 కోట్ల వెండి నిల్వలు కరిగించకుండా విక్రయించి, అవసరమైన నాగపడగలు కొనుగోలు చేస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

    వారం రోజుల క్రితం దే వాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు మొత్తం వెండిని హైదరాబాద్‌లో కరిగించాలని ఆదేశాలు జారీచేస్తే, ఆయన పదవీ విరమణతో కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనురాధ ఒక్క కేజీ వెండి కూడా కరిగించరాదని ఆదేశాలు పంపడం విమర్శలకు దారితీస్తోంది.
     
     కొరత రానివ్వం
     రాహుకేతు పూజలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాగపడగల కొరత రానివ్వం. పూజలకు అవసరమైన నాగపడగలు 75 కేజీలు ఉన్నాయి. నాలుగైదు రోజులు ఇబ్బంది లేదు. దేవాదాయశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి నాగపడగల కోసం వెండిని కరిగించడం కోసం అనుమతి తీసుకుం టాం. పూజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
     -శ్రీనివాసరావు, ఆలయ ఇన్‌చార్జి ఈవో
     

మరిన్ని వార్తలు