కౌలు రైతుల కష్టాల సాగు!

18 Jul, 2018 03:58 IST|Sakshi

రుణాలు రాక నానా అవస్థలు

ప్రభుత్వం చెబుతున్న కౌలుదారులు 17.5 లక్షల మంది

‘రుణ అర్హత’ కార్డులు ఇస్తామని అంటున్నది 6 లక్షల మందికే..

పట్టాదార్‌ పుస్తకాలు ఇచ్చేందుకు భూ యజమానులు ససేమిరా

పంట హామీగా రుణం ఇవ్వాలంటున్న కౌలుదారులు

సాక్షి, అమరావతి: - శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్యవలసకు చెందిన దలి రేయన్నఓ కౌలు రైతు. రుణ అర్హత పత్రం(ఎల్‌ఇసీ) ఉంది. గ్రామసభలో పంట రుణానికి దరఖాస్తు ఇచ్చాడు. మూడేళ్లుగా ఇదే తంతు. ఇంతవరకు పంట రుణం లేదూ, పంటల బీమా కూడా లేదు.
- ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఓ చిన్న సన్నకారు రైతు. ఆయనకున్న రెండున్నర ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటాడు. పంట హామీగా రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా, ఎంతో మందితో చెప్పించినా బ్యాంకులు పట్టించుకోవడంలేదు.
- కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామానికి చెందిన లక్ష్మణస్వామి కూడా ఓ కౌలు రైతు. కౌలుదారుల చట్టం ప్రకారం అన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో కౌలు రైతుల సంఘం సభ్యులతో ఆందోళనకు దిగి ఎట్టకేలకు బ్యాంకు నుంచి రుణం పొందారు.
..పంట రుణం పొందడానికి కౌలు రైతులు పడుతున్న ఇక్కట్లకు ఇవన్నీ సాక్ష్యాధారాలు. వారికి రుణం పెద్ద ఫార్స్‌గా మారింది. వ్యవసాయ శాఖ చెప్పేదానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. రుణ అర్హత పత్రాలు లేవు, సాగు ధృవీకరణ పత్రాలు కానరావు. మరోవైపు.. భూ యజమానులు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌ ఇవ్వరు.. ఇన్ని ఇక్కట్ల మధ్య రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 17 లక్షల మంది కౌలు రైతులు కాడీ మేడీ పట్టారు. 2011 భూ అధీకృత చట్టం ప్రకారం ఎటువంటి హామీ లేకుండా రూ.లక్ష రుణం ఇచ్చేందుకు అవకాశం ఉన్నా బ్యాంకులు పెద్దగా ముందుకు రావడంలేదు. దీంతో రుణాలు అందుతున్న వారి సంఖ్య 3.59 లక్షల మందికి మించడంలేదు. మరోవైపు.. 7–8 వేల కోట్ల రూపాయలను కౌలు రైతులకు రుణాల కింద ఇస్తామని చెబుతున్నా గత ఏడాది (ఖాతాల సర్దుబాటు సహా)ఇచ్చింది కేవలం రూ.2,600 కోట్లే. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో సాగు, రైతుల వివరాలు..
సాగు విస్తీర్ణం : 80,96,441 హెక్టార్లు
రాష్ట్రంలో రైతుల సంఖ్య : 72,21,118
షెడ్యూల్డ్‌ కులాల రైతుల సంఖ్య : 7,13,038
షెడ్యూల్డ్‌ తెగల రైతుల సంఖ్య : 3,87,053
షెడ్యూల్డ్‌ కులాల రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం : 5,12,932 హెక్టార్లు
షెడ్యూల్డ్‌ తెగల రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం : 4,77,432 హెక్టార్లు
షెడ్యూల్డ్‌ కులాల చేతుల్లో సరాసరి విస్తీర్ణం : 1.80 హెక్టార్లు
షెడ్యూల్డ్‌ తెగల చేతుల్లో సరాసరి విస్తీర్ణం : 3.08 హెక్టార్లు

కౌలు రైతుల వివరాలు ఇలా..
– రాష్ట్రంలో వాస్తవ సాగుదారులు : 44 లక్షలకు పైగా
– వీరిలో కౌలుదారులు : 32 లక్షల మందికి పైగా
– ప్రభుత్వం చెబుతున్న లెక్క : 17 లక్షలు
– కౌలుదారుల్లో అసలు భూమి లేనివారు : 7.5 లక్షల మంది
– ఎకరం, అర ఎకరం లోపు : 8 లక్షలు
– 3 నుంచి 5 ఎకరాల లోపు రైతులు : 7 నుంచి 8 లక్షల మధ్య
(వీళ్లు 3 నుంచి 5 ఎకరాల వరకు కౌలుకు తీసుకుంటారు)
– 20 ఎకరాల వరకు భూమి ఉండే రైతులు : సుమారు 10 లక్షల మంది(వీళ్లు కూడా మరో 20 ఎకరాల వరకు కౌలు చేస్తుంటారు)

కౌలు రైతుకు రుణం ఇవ్వాలంటే..
– రుణ అర్హత పత్రం
– పట్టాదార్‌ పాస్‌బుక్‌
– టైటిల్‌ డీడ్‌
– సాగు ధృవీకరణ పత్రం

ఎదురయ్యే సమస్యలు..
– చాలామంది కౌలు రైతులు ఎటువంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు
– కౌలు రైతుకు పంట రుణం ఇవ్వాలంటే భూమి యజమాని రుణం తీసుకోకుండా ఉండాలి
– పట్టాదార్‌ పుస్తకం ఇచ్చేందుకు యజమాని ఇష్టపడడు. టైటిల్‌ డీడ్‌ అసలే ఇవ్వడు. అందువల్ల కౌలు రైతుకు పంట రుణం అసాధ్యంగా మారింది

మరి ఎలా ఇవ్వొచ్చు..
– భూ యజమానికి రుణం కావాలంటే భూమి హామీగా ఇవ్వొచ్చు
– కౌలు రైతుకు పంట హామీతో ఇవ్వొచ్చు
– కౌలు రైతు, అసలు రైతు మధ్య సమన్వయం ఉండాలి
– సమన్వయపరిచేలా రైతు సంఘాలు చొరవ తీసుకోవాలి

చట్టం ఏమి చెబుతోంది?
2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ఎల్‌ఇసీ కార్డు, పంట హామీపై లక్ష రూపాయల వరకు కౌలు రైతులకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉంది. వ్యక్తిగత పూచీకత్తుగా వేసిన పంటను పరిగణించవచ్చు. పెట్టుబడి రాయితీ, మార్కెటింగ్‌ సౌకర్యాలు వంటివి కూడా కౌలు రైతుకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, అది ఆయా బ్యాంకర్ల చిత్తశుద్ధి, రైతుసంఘాల సంఘటిత శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎల్‌ఇసీ కార్డులు ఉన్నప్పుడే రుణం పొందడానికి, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంట నష్టపరిహారం పొందడానికి అర్హులు.

ప్రస్తుత పరిస్థితి ఇదీ..
– 2018–19లో 6,13,639 మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇచ్చి రుణాలు ఇవ్వాలన్నది ప్రతిపాదన
– కానీ, ఇప్పటివరకు 1,72,892 మందికి మాత్రమే కొత్తకార్డులు ఇచ్చారు
– 2018–19లో 5.50 లక్షల మంది కౌలు రైతులకు పంట సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నది లక్ష్యం
– ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం : రూ.76,207 కోట్లు
– దీర్ఘకాలిక రుణాల లక్ష్యం : రూ.30,108.71కోట్లు
– ఇప్పటివరకు కౌలుదారులకు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్న రుణాలు : రూ.624 కోట్లు
– అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కౌలు రైతులకు ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు