నీటి పొదుపుతోనే భవితకు భరోసా 

3 Nov, 2023 05:11 IST|Sakshi
ఐసీఐడీ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌ తదితరులు

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో భూగర్భ జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్‌ తరాలకు అందించగలమన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరిగి సాగునీటికి, పరిశ్రమలకు అందించే­లా రీ సైక్లింగ్‌ ప్రక్రియ చేపడుతున్నామన్నారు.

చెరువు­లు, కుంటలను సంరక్షిస్తూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో డ్యామ్‌ల పరిరక్షణకు ప్రధాని మోదీ సూచన­ల మేరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక కా­ర్య­­క్రమాన్ని ప్రారంభించామన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ (ఐసీఐడీ) సద­స్సును సీఎం జగన్‌తో కలసి ఆయన ప్రారంభించా­రు. అతి సుందరమైన విశాఖ నగరం దీనికి వేదిక కా­వ­­డం ఎంతో సంతోషకరమన్నారు. ఐసీఐడీ కాంగ్రెస్‌­­కు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్‌ ఏమన్నారంటే.. 

140 బిలియన్‌ డాలర్ల వ్యయం 
వ్యవసాయ రంగంలో నీటి కొరతను అధిగమించేందుకు బహుళ విధానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాగునీటి రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సరైన ప్రణాళిక లేకుంటే వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతినడంతో పాటు కరువు పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో సాగునీటికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను 2019లో ప్రధాని మోదీ జలశక్తి శాఖ ఆదీనంలోకి తెచ్చారు. 2024 నాటికి సాగునీరు, పారిశుధ్య రంగాలపై 140 బిలియన్‌ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించాం. దేశంలో సాగు విస్తీర్ణం గత 75 ఏళ్లలో మూడింతలు పెరిగి 140 మిలియన్‌ హెక్టార్లకు చేరింది. దిగుమతి చేసుకునే దశ నుంచి ఈ రోజు తిండిగింజల్లో మిగులు దేశంగా మారడంలో సాగునీటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  

54 ప్రాజెక్టులు..  
నీటి వనరులను అవసరాల మేరకు వినియోగించుకునేందుకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేశంలో 1971లో 111 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం ఉండగా నేడు 250 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు చేరింది. 2023 మార్చిలో ప్రధాని మోదీ 54 ప్రాజెక్టులను ప్రారంభించి అదనంగా 25 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడం ద్వారా రెండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో దేశంలో తలసరి నీటి లభ్యత 20 శాతం తగ్గింది. 2050 నాటికి మరో 20 శాతం తగ్గనుందని అంచనాలున్నాయి. నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు 2022లో బ్యూరో ఆఫ్‌ వాటర్‌ ఎఫిషియన్సీని నియమించాం. 48,500 కి.మీ. మేర మంచినీటి పైపులైన్‌ ఏర్పాటు చేశాం. తద్వారా 28,000 హెక్టార్ల భూ సేకరణను తగ్గించాం.  

నీటి శుద్ధిపై దృష్టి 
నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంలో భాగంగా మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నీటిని సాగునీటికి, పరిశ్రమలకు ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా వాటర్‌ రీ–సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. అమెరికా, చైనా కలిపి వినియోగిస్తున్న భూగర్భ నీటి వనరుల కంటే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం.

ప్రపంచంలోనే  భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తు­న్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. భూ­గర్భ జలాలను పెంచేందుకు వీలుగా మొత్తం 2.4 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గుర్తించాం. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచేందుకు మ్యాపింగ్‌ పూర్తి చేశాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2019లో జలశక్తి అభియాన్‌ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. పూడిక తొలగించి వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు 10 వేల మిలియన్‌ పనులను పూర్తి చేశాం.   

నదుల అనుసంధానం.. 
జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే సమయంలో సాధ్యమైనంత నీటిని ఒడిసి పట్టుకునేందుకు నదుల అనుసంధానాన్ని ప్రారంభించాం. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్న చోట్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటి రంగం రాష్ట్ర పరిధిలోది కావడం వల్ల వాటి సహకారం ఎంతో అవసరం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) చేసుకున్నాయి. కెన్, బెత్వా నదుల అనుసంధానంతో మిలియన్‌ హెక్టార్లకు సాగునీటితోపాటు వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని 6.2 మిలియన్‌ జనాభాకు తాగునీరు లభించనుంది.  

డ్యామ్‌ల రక్షణకు ప్రత్యేక చర్యలు 
దేశంలో జలాశయాల నిర్మాణం ఎప్పటి నుంచో ఉంది. కావేరి నదిపై చోళుల కాలంలో 2 వేల ఏళ్ల క్రితం నిరి్మంచిన కళ్లాని డ్యామ్‌ ఇప్పటికీ ఉంది. దేశంలో మొత్తం 6,000 భారీ డ్యామ్‌లున్నాయి. 2020లో డ్యాం సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రపంచబ్యాంకు సహకారంతో 1.2 బిలియన్‌ డాలర్లతో దేశవ్యాప్తంగా 736 డ్యాంల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లో 223 డ్యామ్‌ల హైడ్రలాజికల్, స్ట్రక్చరల్, ఆపరేషనల్‌ రక్షణ చర్యలను పరిశీలించాం. డ్యామ్‌ల రక్షణతో పాటు నీటి వనరుల వినియోగంపై ఐసీఐడీ చర్చించి భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే సూచనలు చేస్తుందని భావిస్తున్నా.  

నదీ జలాలతో ‘జల్‌ భరో’
విశాఖ ఐసీఐడీ సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ నదుల నుంచి సేకరించిన జలాలను మట్టి కుండల్లో నింపి ‘జల్‌ భరో’ పేరుతో ఒకే చోట చేర్చారు. కేంద్ర మంత్రి షెకావత్, ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి రాంబాబు, అమర్‌నాథ్, విడదల రజని మట్టి కుండల్లో ఉన్న నీటిని తరలించి ఒక చోట చేర్చారు. 25 ఐసీఐడీ అంతర్జాతీయ కాంగ్రెస్‌ యాబ్‌స్ట్రాక్ట్‌ వాల్యూమ్‌తో పాటు హిస్టారికల్‌ వాటర్‌ సస్టైనబులిటీ, వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్స్‌ వాల్యూమ్‌ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సదస్సులో తొలి రోజు సంప్రదాయేతర నీటి వనరులు, రైతు సాధికారత, సుస్థిర లక్ష్యాలు, వ్యవసాయ రంగంలో నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. 

56 దేశాలు... 147 పరిశోధన పత్రాలు
1950లో ఏర్పడిన ఐసీఐడీ పరిశోధనలను మనం వినియోగించుకుంటున్నాం. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. 2025 నాటికి పెరగనున్న 9.8 బిలియన్‌ జనాభాకు అనుగుణంగా నీటి వనరులను వాడుకోవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై సదస్సులో చర్చించాలి. నీటి వినియోగంపై 56 దేశాలకు చెందిన ప్రతినిధులు 147 పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ సదస్సుకు సుందర నగరం విశాఖ కేంద్రం కావడం ఎంతో సంతోషంగా ఉంది.   –ప్రొఫెసర్‌ డాక్టర్‌ రగబ్, ఐసీఐడీ ప్రెసిడెంట్‌ 

పర్యావరణ సమతుల్యతపై దృష్టి
నీటి వనరులను పొదుపుగా వాడుకునేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.   –కుశ్వందర్‌ వోహ్రా, ఐసీఐడీ వైస్‌ ప్రెసిడెంట్‌

మరిన్ని వార్తలు