అగ్నిగోల్డ్ కేసులో మరో ముగ్గురి అరెస్టు

19 Feb, 2016 01:04 IST|Sakshi

 ఏలూరు (సెంట్ర ల్) : ఖాతాదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి సొమ్ములు చెల్లించకుండా మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్ సంస్థ కేసులో మరో ముగ్గురిని సంస్థ వైస్‌చైర్మన్‌తోపాటు ఇద్దరు డెరైక్టర్లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని గురువారం ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరచగా,  రిమాండ్ విధిస్తూ  న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అగ్రిగోల్డ్ సంస్థ తమ డిపాజిట్ కాలపరిమితి తీరినా సొమ్ము చెల్లించలేదంటూ పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల గోవర్ధన కుమారుడు వెంకన్నబాబు 2015 జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థపై నమోదైన కేసులను రాష్ర్ట ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయడంతో ఆ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
 
 ఈ నేపథ్యంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా  వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణరావును సీఐడీ అధికారులు ఈనెల 12న రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, 13న ఉదయం ఏలూరులోని జిల్లా న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ  వద్ద హాజరుపరచగా.. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు  వారిని జిల్లా జైలుకు తరలించారు. సోమవారం నిందితులిద్దరూ బెయిల్ కోరుతూ జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, వారిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు మరో పిటీషన్ దాఖలు చేశారు. ఫలితంగా న్యాయస్థానం బెయిల్ పిటీషన్‌ను తోసిపుచ్చింది.
 
  వారంపాటు వారిని  సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఫలితంగా సీఐడీ అధికారులు వారిని బుధవారం కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్లి విచారిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మరో ముగ్గురు సంస్థ వైస్‌చైర్మన్ ఇమ్మడి సదాశివవరప్రసాద్, మేనేజింగ్ డెరైక్టర్లు కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, లాల్ అహ్మద్‌ఖాన్‌ను బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం ఉదయం ఏలూరు జిల్లాకోర్టులో ఇన్‌చార్జ్ జిల్లా న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఈ ముగ్గురికి రిమాండ్ విధించారు. పోలీసులు వారిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య  జిల్లా జైలుకు తరలించారు. అయితే వీరిని కూడా కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు