మార్చి 15లోగా 300 పాఠశాలల్లో బయోమెట్రిక్ | Sakshi
Sakshi News home page

మార్చి 15లోగా 300 పాఠశాలల్లో బయోమెట్రిక్

Published Fri, Feb 19 2016 1:01 AM

Biometric 300 schools by March 15

ఏలూరు (మెట్రో) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ కార్యక్రమాలను అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశలో 300 పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మార్చి 15లోగా పూర్తి చేయాలని, మిగిలిన పాఠశాలల్లో దశలవారీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలస్థాయి పెంచే విధంగా కృషి చేయాలని, తనిఖీ చేసిన పాఠశాలల వివరాలు, తనిఖీలో గుర్తించిన అంశాలను ఎంఈవోలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
 
 వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పాఠశాల ప్రారంభం రోజు నుంచి యూనిఫామ్‌లకు సంబంధించి అవసరమైన క్లాత్ సరఫరా, యూనిఫామ్ సకాలంలో కుట్టి అందించేందుకు ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లను విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రహరీగోడలు లేని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో దశలవారీగా ప్రహరీగోడలు నిర్మిస్తామని, అంతవరకు వీటికి బయోఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
 విద్యార్థుల ఆధార్‌కార్డు వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. మధ్యాహ్న భక్షజన పథకానికి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నామని, ఈ బియ్యం నాణ్యతలోగాని, బస్తాల కొలతల్లో ఏదైనా తరుగుదల ఉంటే వెంటనే వాటిని సంబంధిత చౌకడిపో డీలర్లకు వెంటనే తిరిగి ఇచ్చి తూకంతో బియ్యం పొందాలన్నారు. సమావేశంలో సర్వశిక్షాభియాన్ పీడీ వి.బ్రహ్మానందరెడ్డి, టెరిటోరియల్ జిల్లా అటవీ శాఖాధికారి శ్రీనివాసశాస్త్రి, అటవీశాఖాధికారి సామాజికవనాలు వైఎస్.నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేవీకెవీ ప్రసాద్, డీఈలు, డెప్యూటీ డీఈవోలు డి.ఉదయభాస్కర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement