గోదారి ప్రమాదం

23 Jul, 2015 02:16 IST|Sakshi

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు దుర్మరణం
మృతుల్లో ఇద్దరు మహిళలు,ఒక ఆర్టీసీ డ్రైవర్
 పలువురికి గాయాలు


సోమల : గోదావరి పుష్కరాలకు వెళ్లిన జిల్లావాసులు ముగ్గురు వేర్వేరు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. మృతుల్లో సోమలకు చెందిన ఇద్దరు మహిళలతోపాటు మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు. వివరాల్లోకెళితే.. సోమలకు చెందిన శివరాం, ఆయన భార్య  వడ్డిపల్లి కుమారి(44), గంగయ్య, ఆయన భార్య వెంకటలక్ష్మమ్మ(50), ఆర్మీ ఉద్యోగి సుబ్రమణ్యంతోపాటు వెంకటమ్మ, శాంతమ్మ, సోమల ఎంపీటీసీ సభ్యురాలు వసంతమ్మ, ఆమె భర్త రమణలు సోమవారం గోదావరి పుష్కరాలకు టవేరా కారులో బయలుదేరి వెళ్లారు. మంగళవారం వారు రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర ఘాట్‌లో స్నానాలు చేసిన అనంతరం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద టీ తాగేందుకు ఆగారు. కుమారి, వెంకటలక్ష్మమ్మ, గంగయ్యలు టీ తాగుతుండగా మిగిలిన వారు కారులోనే ఉన్నారు. ఇంతలో అనంతపురం జిల్లాయాడికి గ్రామానికి చెందిన పుష్కర భక్తులు తూఫాన్ వాహనంలో వచ్చి టవేరా వెనుక నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. ఇంతలో గూడ్స్‌వ్యాన్ దూసుకొచ్చి ఆగి ఉన్న తూఫాన్ కారును ఢీకొట్టింది.

ఆ వాహనం వెళ్లి ముందున్న టవేరా కారును బలంగా తాకింది. దీంతో వడ్డిపల్లి వెంకటలక్ష్మి(60), వడ్డిపల్లి కుమారి(45) అక్కడికక్కడే మృతిచెందగా గంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. టవేరా కారులో కూర్చున్న ఆరుగురు, తూఫాన్ వాహనంలో ఉన్న రంగస్వామి, భాగ్యలక్ష్మిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు పత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కుమారి భర్త శివరాం టీచర్ కాగా వీరికి కుమార్తె స్వాతి (24), కుమారుడు  తేజ(11) ఉన్నారు. అలాగే వెంకటలక్ష్మమ్మ భర్త గంగయ్య విశ్రాంత ఉద్యోగి, వీరికి ఇద్దరు కుమారులు ఆనంద్(25), నాగరాజు(20) ఉన్నారు. ఎంతో భకిృ్తతో పుష్కరాలకు వెళ్లిన  తమకు భగవంతుడు ఇలా ద్రోహం చేశాడంటూ బంధువులు విలపిస్తున్నారు. మృతదేహాలను బుధవారం రాత్రి సోమలకు తీసుకురానున్నారు. మృతదేహాలను సోమలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఈ ఘటనతో సోమలలో విషాదచాయలు అలుముకున్నాయి.
 
 

మరిన్ని వార్తలు