రైల్వే భూ పరిహారంపై వివాదం

20 Jan, 2015 02:40 IST|Sakshi
రైల్వే భూ పరిహారంపై వివాదం

ఆర్డీఓ సమక్షంలో వైఎస్సార్  సీపీ, టీడీపీ నేతల వాగ్వాదం
 
కళ్యాణదుర్గం :  రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంపై వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. వివరాల్లోకివెళ్తే... టీడీపీ నేతలు పాపంపల్లి రామాంజినేయులు, పురుషోత్తం తదితరులు ఆర్డీఓ రామారావుతో కార్యాలయంలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీకి చెందిననారాయణపురం సర్పంచ్ సుగుణ భర్త వెంకటేశులు మరో 20 మంది రైతులు పరిహారం కోసం ఆర్డీఓను కలిసేందుకు వెళ్లారు.

కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు మూడు సార్లు రైతులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అన్ని భూములకు ఒకే తరహా పరిహారం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారని ఆర్డీవో దృష్టికి తెచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలు రామాంజినేయులు, పురుషోత్తం జోక్యం చేసుకుంటూ ఇదంతా ఎన్నికల ముందు లబ్ధి కోసం మాజీ మంత్రి రఘువీరారెడ్డి రైల్వే టెండర్లు పిలిపించి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

దీంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నేతలు వెంకటేశులు, తదితరులు ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని, తాము ఆర్డీఓతో మాట్లాడుతుంటే ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మీరంటే మీరే రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్డీఓ సైతం నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న టౌన్ ఎస్‌ఐ జయనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ జెడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ సర్పంచ్ కొల్లప్ప, వైస్ ఎంపీపీ వెంకటేశులు, ములకనూరు కిష్టాతో పాటు మరో 50 మంది రైతులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. రైతులకు పరిహారం ఇచ్చేదాక రైల్వే పనులు చేయనియబోమని స్పష్టం చేశారు.

వైఎస్సార్ సీపీ నేతలు, రైతులు ఆందోళనకు దిగడంతో ఆర్డీఓ కార్యాలయం గందరగోళంగా మారింది. చివరికి జోక్యం చేసుకున్న ఆర్డీఓ రెవెన్యూ చట్టప్రకారం ప్రభుత్వం నుంచి బాధిత రైతులకు వచ్చే పరిహారాన్ని అందజేస్తామని, ఇందులో రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఇప్పటికే పరిహారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ విషయాన్ని మరోసారి పైఅధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు