త్వరలో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు

11 Feb, 2014 02:05 IST|Sakshi

చేవెళ్ల, న్యూస్‌లైన్:  రైతుల సౌకర్యార్థం జిల్లాలోని ఐదు చోట్ల వేరుశనగ (పల్లి) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సీఎల్‌ఆర్‌సీ భవనంలో నాగపూర్‌లో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మండలంలోని రైతులకు చూపించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

 అనంతరం వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విజయ్‌కుమార్ మాట్లాడారు. జిల్లాలో రైతులు ఈసారి సుమారు 9200 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారని, ఈ నెలాఖరులోగా పంట పూర్తిస్థాయిలో చేతికి వస్తుందన్నారు. పంట దిగుబడులు దళారులకు, వ్యాపారులకు అమ్ముకోకుండా ఉండేందుకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పరిగి, కుల్కచర్ల, నంచర్ల, తాండూరు, ధారూరులలో వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.4వేలు ఉన్నట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రబీలో జిల్లాలో సాధారణ వ్యవసాయ సాగు విస్తీర్ణం 55 వేల హెక్టార్లు కాగా, ఇప్పటికే 45 వేల హెక్టార్లలో పలు పంటలు సాగయ్యాయని తెలిపారు. వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నందున వారం పది రోజులలోగా మరో పదివేల హెక్టార్లు కూడా సాగయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

 రబీ పంట రుణాలు 80 శాతం పంపిణీ
 రబీ సీజన్‌లో జిల్లాలోని రైతులకు పలు బ్యాంకులు, పీఏసీఎస్‌ల ద్వారా రుణాల పంపిణీ కార్యక్రమం 80 శాతానికి చేరుకుందని విజయ్‌కుమార్ తెలిపారు. రబీలో రూ.706 కోట్లు రుణ పంపిణీ లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.563 కోట్లు పంపిణీ చేశారని ఆయన చెప్పారు.

 మార్చి 31లోగా మిగతా లక్ష్యం పూర్తవుతుందని వివరించారు. గత ఏడాది పైలిన్, హెలెన్ తుపాన్‌ల ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారంగా రూ.22 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఆమోదంతో పంపిన ఈ పరిహారం ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందన్నారు. త్వరలో నిధులు విడుదలవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 2011లో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 3600 మంది రైతులకు గాను రూ.77 లక్షలు విడుదలయ్యాయని తెలిపారు. వాటిని రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. పంటలు నష్టపోయిన, అర్హులైన ప్రతి రైతులకు పరిహారం వస్తుందని చెప్పారు.

 రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు
 జిల్లాలోని రైతులకు సబ్సిడీపై ఆధునిక, సాంకేతిక యంత్ర పరికరాల పంపిణీ కింద ప్రభుత్వం రూ.8.5 కోట్లు కేటాయించిందని  విజయ్‌కుమార్ తెలిపారు. కస్టమ్ హైరింగ్ స్టేషన్ (సీహెచ్‌ఎస్), ఇంప్లిమెంట్ సర్వీస్ స్టేషన్ పథకం కింద యంత్ర పరికరాల కొనుగోలుకు పరికరాలను బట్టి 33నుంచి 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తోందని ఆయన వివరించారు.

ఇందులో పంటలు నాట్లు వేసేటప్పటినుంచి కోత కోసే వరకు ఉపయోగించే పలు పరికరాలు ఉంటాయని తెలిపారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి ఈ పరికరాలను గ్రూపుల వారీగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానం కింద ‘‘పోర్టబుల్ వర్మీ కంపోస్ట్ బెడ్స్‌‘‘ వేసుకునేందుకు జిల్లాకు 1200 యూనిట్లు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. యూనిట్ విలువ రూ.10వేలు ఉండగా, ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని భరిస్తుందని తెలిపారు.

 హైకాస్ట్ మెషినరీ కింద జిల్లాకు 5 వరికోత యంత్రాలు సబ్సిడీపై అందజేస్తామన్నారు. ఈ యంత్రాలు స్థాయిని, కంపెనీలను బట్టి రూ.19లక్షల నుంచి రూ.22 లక్షలుగా ఉందన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తుందని, ఈ యంత్రాన్ని గ్రూపులుగానూ, వ్యక్తిగతంగానూ తీసుకోవచ్చని ఆయన సూచించారు. జిల్లాకు టార్పాలిన్ (తాడిపత్రిలు)ల కోసం రూ.కోటి 25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు.

ఒక్కో టార్పాలిన్ విలువ రూ.2500 ఉంటుందని, ఒక్కో రైతుకు 50 శాతం సబ్సిడీపై మూడు చొప్పున అందజేస్తామని తెలిపారు. ఆసక్తిగల రైతులు యంత్ర పరికరాలకు, ఇతర ఏదైనా సమాచారానికి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో చేవెళ్ల డివిజన్ ఏడీఏ దేవ్‌కుమార్, టెక్నికల్ ఏఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు