యువమార్గం... మార్పు కోసం

12 Jan, 2016 01:14 IST|Sakshi

నేడు జాతీయ యువజన దినోత్సవం
 

పెదగంట్యాడ  యువత అంటే లక్ష్యాల సాధన కోసం అహర్నిశలు కష్టపడే ఒక వర్గం. యువత అంటే పెడదారి పట్టడానికి సిద్ధంగా ఉన్న వర్గమని మరికొందరి అభిప్రాయం. ఈ రెండూ విభిన్న దృక్పథాలు. స్ఫూర్తి నింపే వ్యక్తులుంటే పెడదారి నుంచి సన్మార్గం పట్టే అవకాశాలే మెండుగా ఉంటాయి. ఇందుకు కావలసిందల్లా సరైన మార్గదర్శనం. కర్తవ్య దీక్ష, స్పష్టమైన లక్ష్యాలు, ఆశావహ దృక్పథం. ప్రస్తుత సమాజంలో యువత లక్ష్యాలు, చేరుకోవాలనుకునే గమ్యాలు అంత సులభమైనవి కాదు. 1950లలో యువతరానికిఅక్షరాస్యత ఉంటే ఉద్యోగం వచ్చేది. తర్వాత 60లలో కొంచెం పోటీ పెరిగింది. 70, 80లు వచ్చే సరికి చేతిలో డిగ్రీలు, ఖాళీ కడుపులతో రోడ్లపై తిరిగే నిరుద్యోగులు అడుగడుగునా కనిపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది... సొంతంగా చిన్న ఎంటర్‌పెన్యూర్‌షిప్ తీసుకుని కాలేజ్ పూర్తికాక ముందే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు చదువు లక్ష్యం ఉద్యోగం సంపాదించడం మాత్రమే. కానీ ఇప్పటి యువతకు ఉద్యోగం కన్నా మంచి జీవితం ముఖ్యం. ఏదో సాధించాలనే తపన ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కొత్తదనం కోసం కాకుండా సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నించే యువకులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అందులో కొందరైనా మిగిలిన యువతలో స్ఫూర్తి నింపుతారు. మార్గదర్శకులవుతారు.
 
సమాజానికో సందేశం...
ఒక ప్రవేట్ స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తూ జీవితం సాగించే అప్పలరెడ్డి, డాన్స్ టీచర్‌గా పని చేస్తున్న మధు అనే ఇద్దరు యువకులు కలిసి ఇండియా యూత్ ఫర్ సొసైటీ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. దానిని నిర్వహించడానికి అష్ట కష్టాలు పడ్డారు. ఉన్న కొంత సమయంలోనే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించడం గురించీ, బీచ్ పరిసరాలను శుభ్రం చేయడం గురించి ఎన్నో సందేశాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎంసీఏ దగ్గర ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహించి యువతను ఆకర్షించేవారు. ద్వారకా నగర్ జంక్షన్‌లో ప్లకార్డులతో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ఇప్పటికీ ఎవరికి వారు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
అనాథ బాలల సేవలో...
 మురళీనగర్ జనరేషన్ యువ.... ఇది కూడా నలుగురి యువకుల లక్ష్యమే, వైజాగ్‌లో చైల్డ్ బెగ్గర్స్‌ను రూపు మాపడానికి అహర్నిశలు కష్టపడ్డారు. చివరకు సాధించారు. వారి వద్ద ఇప్పుడు 60 మందికి పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని రక్షించడానికి అర్ధరాత్రిళ్లు కూడా పిల్లల వెంట పరుగులు తీసి వాళ్ల చేత రాళ్ల దెబ్బలు తిన్నారు. ఇంజినీరింగ్ చదివి, విదేశాల వెళ్లి ఉద్యోగంలో స్ధిరపడాల్సిన సమయంలో ఒక చిన్న సంఘటన ద్వారా నరేష్ అనే యువకుడు సమాజానికి ఏదో చెయ్యాలని తాపత్రయ పడడంతో మొదలైన జనరేషన్ యువ ప్రారంభం అయింది.
 
సాహసం, ధైర్యం నిండిన యువత కావాలి....
నెత్తురులో ఓజస్సు, నరాల్లో సత్తువ, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలి...కార్యోన్ముఖులను చేసే ఆలోచనలు ఉండాలి. తనపై తనకు అచంచలమైన విశ్వాసం, స్థిర నిశ్చయం కలిగి, కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నిత్యం సంసిద్ధంగా ఉండడమే యువ లక్షణం
 
 

మరిన్ని వార్తలు