ఎన్నికల వాయిదా పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

18 Mar, 2020 03:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. ఈ మేరకు నేటి విచారణల జాబితాలో ఇది ఏడో కేసుగా నమోదైంది. తొలి ఆరు కేసుల విచారణ అనంతరం అరగంట విరామం తరువాత తిరిగి ధర్మాసనం తదుపరి కేసులను విచారించనున్నట్టు సుప్రీంకోర్టు నోటీసులో పెట్టింది. 

‘సుప్రీంకోర్టు తీర్పును ఎన్నికల సంఘం ఉల్లంఘించింది’
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు గతంలో కిషన్‌సింగ్‌ తోమర్‌ కేసులో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉల్లంఘించిందని ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్‌లో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243ఇ, 243యు లో నిర్ధేశించిన మేరకు మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీనిని గౌరవించలేదని వెల్లడించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర రోజువారీ పాలనలో మాత్రమే కాకుండా కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పిటిషన్‌లో పేర్కొంది. మార్చి 15న ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది.  

మరిన్ని వార్తలు