ఆరు రోజులైనా.. ఆచూకీ లేదు!

13 Jan, 2016 23:25 IST|Sakshi

మాజీ సర్పంచ్ హత్య కేసులో గిరిజనుల నిర్బంధం
ఆదివాసీలను రహస్యంగావిచారిస్తున్న పోలీసులు
తమ వారు ఎక్కడున్నారో తెలియక కుటుంబసభ్యుల ఆందోళన
పోలీసులు, మావోయిస్టులకు మధ్య నలుగుతున్న గిరిజనులు

 
విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం.. అన్నట్టు తయారైంది ఆదివాసీల పరిస్థితి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య  వారు నలిగిపోతున్నారు. ఇటీవల మావోలు చేసిన ఓ హత్యకు  సహకరించారంటూ పోలుసులు కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. అయితే పోలీసులు తీసుకువెళ్లిన తమవారు ఎక్కడున్నారో తెలియక వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 
విశాఖపట్నం/జీకేవీధి: జర్రెల పంచాయతీ మాజీ సర్పంచ్, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టర్ సాగిన వెంకటరమణ  హత్య కేసును  తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు మావోలతో కలిసి వచ్చిన గిరిజనులు ఎవరనేదానిపై   కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకొని  రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు.   ఎవరినైనా అరెస్ట్ చేస్తే  వారిని 24గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. కానీ వీరి విషయంలో అలా జరగలేదు. నిజానికి గిరిజనులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు రికార్డుల్లో లేదు.  వారిపై ఇంతవరకూ ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. దీంతో తమ వారిని పోలీసులు ఏం చేస్తారోనని బాధిత కుటుంబసభ్యులు భయపడుతున్నారు.

నలిగిపోతున్న గిరిజనులు : పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గిరిజనులు ఎప్పటినుంచో నలిగిపోతున్నారు. తమకంటే తమకే సహకరించాలంటూ  ఇరువర్గాలు గిరిజనులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ దాని కోసం ఇన్‌ఫార్మర్లను వినియోగించుకుంటున్న పోలీసులు వారికి భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. దీంతోత ఏడాది కాలంలో నలుగురు  గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్లనే కారణంతో మావోయిస్టులు చంపేశారు. ఇప్పుడు మాజీ సర్పంచ్‌నే మట్టుబెట్టారు. అయితే ఈ దుశ్చర్యకు కూడా గిరిజనులను వెంటతీసుకువెళ్లారు. వెళ్లకపోతే మావోయిస్టుల దృష్టిలో వ్యతిరేకులవుతారు. వెళితే పోలీసుల దృష్టిలో నేరస్థులవుతారు. ఎలా చూసినా గిరిజనులకే నష్టం. మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడిన ప్రతిసారీ అనుమానితులంటూ గిరిజనులను పోలీసులు పట్టుకుపోవడం సర్వసాధారణమైపోయింది.

బాక్సైట్ వ్యతిరేకంగా పోరాడుతున్నందునే..
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మావోలతో సంబంధాలు అంటగట్టి చిచ్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు.   ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేసిన నాటి నుంచి గిరిజనులకు అండగా ఉంటున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారు.   గత నెల 10న  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చింతపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేయించారు. ఆ సభకు హాజరైన జన సందోహాన్ని చూసి ఓర్వలేని పాలకపక్ష  నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశార ని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై   ఫిర్యాదులు చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహంతో ఆమెపై హత్యానేరం, దేశద్రోహం వంటి కేసులు నమోదు చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరికి అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కుట్ర పూరితమైన నిర్ణయాలు తీసుకుదనే  విమర్శలు ఉన్నాయి.  టీడీపీ నాయకుడు సాగిన వెంకటరమణ  హత్యకు సంబంధించి అదుపులోకి తీసుకు అమాయక గిరిజనులను  విడిచి పెట్టాలని కోరేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఈశ్వరితోపాటు  ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలు విష్ణుమూర్తి, ప్రసాద్‌లను విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని పోలీసులు నిర్బంధించారు.  
 
విచారించకుంటే ఎలా?
‘మాజీ సర్పంచ్ వెంకటరమణను హత్యచేసిన సంఘనటలో మావోయిస్టులతో పాటు దాదాపు 300 మంది ఉన్నారు. వారిలో వందలాది మంది గిరిజనులేననే సమాచారం మాకుంది. దీనికి సంబధించి పలు ఆధారాలు కూడా మాకు లభించాయి. వాటి ఆధారంగా కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న మాట వాస్తవం. మరి కొందరిని కూడా విచారించాల్సి ఉంది. పూర్తి సమాచారం వచ్చేంత వరకూ దర్యాప్తు చేస్తాం. నేరస్థులు ఎవరనేది తెలుసుకోవడానికి విచారణ జరపడం తప్పనిసరి. దీనికి కొన్ని రోజులు సమయం పట్టడం సహజం. రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. ఈ లోగా తొందరపడితే అమాయకులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.’
 -కోయ ప్రవీణ్, ఎస్పీ, విశాఖపట్నం
 

మరిన్ని వార్తలు