సొంత విద్యుత్‌కు టీటీడీ ప్రణాళిక

12 Aug, 2015 19:48 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగానే సమకూర్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపకల్పను రూపొందిస్తున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథి గృహంలో విభాగాధిపతులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం సుమారు 30 శాతం వరకు పవన విద్యుత్(విండ్ పవర్) ద్వారా సమకూర్చుకుంటున్నామన్నారు. దీంతో పాటు 10 మెగావాట్లను సోలార్ ద్వారా, మరో 7.5 మెగావాట్ల పవన విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచామన్నారు. దీనివల్ల మరో తొమ్మిది నెలల తర్వాత తిరుమలకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగానే సిద్ధం చేసుకునే అవకాశం ఉందన్నారు.

భవిష్యత్‌లో టీటీడీ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తుందని, కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండబోదన్నారు. వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పక డ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. వర్షాల కోసం త్వరలోనే వరుణయాగం నిర్వహిస్తామన్నారు.

24న ధర్మకర్తల మండలి సమావేశం
ఈనెల 24వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో చర్చించాల్సిన అంశాల ఎజెండాను ఈవో దొండపాటి సాంబశివరావు రూపొందిస్తున్నారు. మంగళవారం హుండీ కానుకలు రూ.3.42 కోట్లు లభించింది.

మరిన్ని వార్తలు