రాజ్యసభకు మోపిదేవి, అయోధ్యరామిరెడ్డి

10 Mar, 2020 08:28 IST|Sakshi
అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి

ఖరారు చేసిన అధిష్టానం 

బీసీ నేతగా మోపిదేవికి తగిన ప్రాధాన్యం

పార్టీ సేవలకు గుర్తింపుగా అయోధ్యరామిరెడ్డికి అవకాశం

సాక్షి, అమరావతి: రాజ్యసభ సభ్యులుగా గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. రాంకీ అధినేత ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు అవకాశం కల్పించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో  వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని శ్రీకృష్ణదేవరాయలుకు కేటాయించగా ఆయన జిల్లా పార్టీ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ సముచిత స్థానం కల్పించేందుకు రాజ్యసభకు పంపిస్తోంది. రామిరెడ్డికి జిల్లాలో రాజకీయంగా విస్తృత సంబంధాలు ఉండటంతో పాటు, రాజకీయలపై మంచి పట్టుంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు గుంటూరు, కృష్ణా జిల్లాల పరిశీలకులుగా ఆయన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మరోవైపు శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్సీ స్థానంలో ఉండి మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణారావుని కూడా రాజ్యసభకు పంపిస్తున్నారు. నిరంతరం పార్టీ వెన్నంటే ఉన్న బీసీ నేతకు పార్టీ రాజ్యసభ స్థానం ఇవ్వడంపై బీసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.  

సీఎం ఆలోచనలను బలోపేతం చేస్తా.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరును, ఆయన ఆలోచనలను బలోపేతం చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నా. రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సీఎం ప్రవేశపెడుతున్న నూతన పాలసీలకు కేంద్రం నుంచి సపోర్టు తీసుకురావడానికి ప్రత్యేకంగా నావంతు కృషి చేస్తా. నాకు రాజ్యసభ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. 
–ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, రాంకీ అధినేత  
 
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బయోడేటా 
జన్మస్థలం: పెదకాకాని 
పుట్టిన తేదీ: 12–8–1964 
తల్లిదండ్రులు: ఆళ్ల దశరథరామిరెడ్డి, వీర రాఘవమ్మ 
కుటుంబం: దాక్షాయణి (భార్య), శరణ్‌ (కుమారుడు), శ్రావ్య (కోడలు), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే–ఎమ్మెల్యే), పేరిరెడ్డి–వ్యాపారవేత్త, సోదరి మల్లీశ్వరి 
– ప్రాథమిక విద్య (1 నుంచి 5) పెదకాకాని గుంటూరు జిల్లా ఉన్నత పాఠశాల, (6 నుంచి 10) బాపూజీ హైస్కూల్‌–గుంటూరు, ఇంటర్మీడియెట్‌ రెడ్డికాలేజీ–నరసరావుపేట, బీఈ సివిల్‌ బెళగాం–కర్ణాటక, ఎంఈ సివిల్‌ ఉస్మానియా వర్సిటీ హైదరాబాద్, 1984 నుంచి 1988 వరకు సివిల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం. 1988లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. 1994లో రాంకీ గ్రూప్స్‌ వ్యవస్థాపన. ఏడు కంపెనీలకు చైర్మన్‌గా విదేశాల్లో సైతం వ్యాపారాన్ని విస్తరించారు. వ్యర్థాల నిర్వహణలో ఆసియాఖండంలోనే ప్రధాన కంపెనీల్లో ఒకటిగా రాంకీ గుర్తింపు. రాంకీ ఫౌండేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా విద్య, మహిళ సాధికారత, సహజ వనరుల సంరక్షణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు.
 
మోపిదేవి వెంకటరమణారావు బయోడేటా
స్వస్థలం:     నిజాంపట్నం 
పుట్టిన తేదీ : 06–08–1964 
తల్లిదండ్రులు: రాఘవయ్య, నాగులమ్మ 
విద్యార్హత : బీఏ 
కుటుంబం: అరుణభాస్కరి(భార్య), రాజీవ్‌(కుమారుడు), జస్మిత(కుమార్తె) 
రాజకీయ చరిత్ర : 1984లో ఎంపీపీ(కాంగ్రెస్‌), 1989, 1994లో రెండుసార్లు కూచినపూడి ఎమ్మెల్యేగా పోటీ(కాంగ్రెస్‌), 1999, 2004లో కూచినపూడి ఎమ్మెల్యేగా గెలుపు(కాంగ్రెస్‌),  2009లో రేపల్లె ఎమ్మెల్యేగా గెలుపు(కాంగ్రెస్‌), 2014, 2019లో రేపల్లె ఎమ్మెల్యేగా ఓటమి(వైఎస్సార్‌ సీపీ), 2004, 2009లో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో కూడా పలు శాఖలు నిర్వహించారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లో మరోసారి మంత్రి అయ్యారు.   

మరిన్ని వార్తలు