వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

18 Dec, 2015 00:08 IST|Sakshi

రామభద్రపురం(తెర్లాం రూరల్):  జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు... బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన నల్లా వెంకటరావు(22), తన తల్లి కళావతి, మరో ఇద్దరితో కలిసి ధాన్యం ఆడించేందుకు నాటు బండిపై రామభద్రపురంలోని రైస్‌మిల్లు వద్దకు వచ్చారు. ధాన్యం మిల్లులో ఆడించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒడిశా నుంచి రామభద్రపురం మీదుగా విజయనగరం వైపు వెళ్తున్న లారీ స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో నాటుబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాటుబండి తోలుతున్న నల్లా వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి కళావతికి తీవ్ర గాయాలయ్యాయి. నాటుబండిపై ఉన్న గజరాయునివలస గ్రామానికి చెందిన ఎం.లక్ష్మికి కూడా గాయాలయ్యాయి. సత్యనారాయణ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. నాటుబండిని లాగుతున్న రెండు ఎద్దుల్లో ఒకటి ప్రమాదస్థలంలోనే చనిపోయింది.
 
 వెంకటరావు మృతిచెందాడని, అతని తల్లి కళావతి తీవ్రంగా గాయపడిందని తెలుసుకున్న గజరాయునివలస గ్రామస్తులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కుమారుడు మృతిచెందడం, భార్య తీవ్రంగా గాయపడటంతో వెంకటరావు తండ్రి తిరుపతి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రామభద్రపురం పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ బీవీ రమణ సిబ్బందితో వెళ్లి ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. నల్లా కళావతి, ఎం.లక్ష్మిలను చికిత్స కోసం బాడంగి సీహెచ్‌సీకి పంపారు. వెంకటరావు మృతదేహానికి శపంచనామా పూర్తిచేసి పోస్టుమార్టం కోసం బాడంగి సీహెచ్‌కి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని హెచ్‌సీ బీవీ రమణ తెలిపారు. వెంకటరావు మృతిచెందడంతో గజరాయునివలసలో విషాదఛాయలు అలముకున్నాయి.  
 
 ధాన్యం నూర్పిడి యంత్రం తిరబడి...
  పదమాయవలస (బలిజిపేటరూరల్): పదమాయవలస గ్రామ సమీపంలో ధాన్యం నూర్పిడి యంత్రం తిరగబడటంతో ఓ వ్యక్తి మరణించాడు. పదమాయవలస గ్రామానికి చెందిన చింతాడ పోలిరాజు(32), మరికొందరు కూలీలు కలిసి పొలాల్లో ధాన్యం నూర్పిడి చేసేందుకు యంత్రంతో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యంలో పొలాల వద్ద మలుపుతిరిగే సమయంలో ఆ యంత్రం అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో యంత్రంపై కూర్చున్న కూలీలు కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన పోలిరాజు అక్కడికక్కడే మరణించాడు. ఎం.జీవులు, సీహెచ్ సీతయ్య, కృపారావు, రాజారావు, తవుడు, ఎ.కృపారావుకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విజయనగరం తరలించారు. పోలిరాజుకు భార్య, ఒక కుమార్తె, వికలాంగుడైన కుమారుడు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు