సీమాంధ్ర ఉద్యోగులకు 2 నెలల అడ్వాన్స్!

22 Oct, 2013 01:38 IST|Sakshi
సీమాంధ్ర ఉద్యోగులకు 2 నెలల అడ్వాన్స్!
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 66 రోజుల పాటు సమ్మె చేసిన సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈమేరకు రూపొందించిన ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ వెళ్లనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెలో ఉండటం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెల జీతాలు ఉద్యోగులకు అందలేదు. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటంతో ఆగస్టు 12 వరకు పనిచేసిన రోజులకు కూడా జీతాలు ఇవ్వడానికి అప్పట్లో వీలు కాలేదు. సమ్మె విరమించిన నేపథ్యంలో రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాయి. 
 
 దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎస్ ఈమేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్స్ చెల్లించాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగులకు చెల్లించే అడ్వాన్స్‌ను ఏడాది వ్యవధిలో నెలవారీ వాయిదాల్లో రికవరీ చేయనున్నారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వకూడదంటూ ‘నో వర్క్ నో పే’ విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో ప్రభుత్వం 177 జీవో జారీ చేసిన విషయం విదితమే. ఈ జీవో అమల్లో ఉండగా జీతాలు చెల్లించకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమ్మె కాలానికి సరిపడా (66 రోజులు) ఆర్జిత సెలవు(ఈఎల్)లను తీసుకొని జీతాలు చెల్లించడానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత సెలవులు లేని వారికి భవిష్యత్‌లో వచ్చే సెలవులు తీసుకుంటామనే నిబంధన(ఈఎల్స్ డ్యూ) మీద జీతాలు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది.
 
మరిన్ని వార్తలు