మరో 1,600 మెగావాట్ల విద్యుత్‌ 

19 Jun, 2020 04:00 IST|Sakshi

రెండు థర్మల్‌ ప్లాంట్లు ఉత్పత్తికి సిద్ధం

ఆరు నెలల్లో వాణిజ్య ఉత్పత్తిలోకి

కాంట్రాక్టులిచ్చి వదిలేసిన గత సర్కారు

రూ.2 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతో  కృష్ణపట్నం, వీటీపీఎస్‌ పనుల్లో వేగం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్‌కో మరో రెండు కొత్త సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్లను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఉత్పత్తిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనివల్ల మరో 1,600 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతతో ఈ ప్లాంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో 4,500 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తుండగా కొత్తవి అందుబాటులోకి వస్తే జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం 6,100 మెగావాట్లకు పెరుగుతుంది. భవిష్యత్తులో డిమాండ్‌ పెరిగినా సొంతంగా విద్యుత్‌ సరఫరా చేసే స్థాయికి జెన్‌కో ఎదిగింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి గురువారం ‘సాక్షి’కి వివరించారు.  

► రాష్ట్ర అవసరాల కోసం ఇబ్రహీంపట్నంలో డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 8వ యూనిట్‌ (800 మెగావాట్లు), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో రెండోదశ (800 మెగావాట్లు)ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇవి 2018లోనే పూర్తవ్వాల్సినా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో వ్యయం పెరిగింది.

► గత ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్‌ సంస్థల ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్‌కోకు స్థాయికి మించి అప్పులున్నాయి. ఫలితంగా కొత్తగా అప్పు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం కొత్త థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణం పనులు మందగించాయి. 

► ఈ రెండు ప్లాంట్లకు ఒక్కోదానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో ఆరు నెలల్లో రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  

ప్లాంట్ల వ్యయం ఇలా రూ.కోట్లలో 

మరిన్ని వార్తలు