అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది

22 Jun, 2015 02:40 IST|Sakshi
అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది

ఉమ్మారెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి బొత్స
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, చంద్రబాబు దెబ్బకు రాష్ట్రం ఎటువైపు వెళుతుందోనని ఆందోళన కలుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో గుంటూరులో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. చట్టంపైన, ప్రజాస్వామ్యంపైన గౌరవం లేని ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోందని మండిపడ్డారు.

ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి టీడీపీ నీచ రాజకీయాల కు కంకణం కట్టుకుందన్నారు.రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ 25న అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు.
 
ప్రజల్ని మేనేజ్ చేయలేరు: అంబటి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు కేసీఆర్, కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకునో, కేసు నుంచి బయటపడగలరేమోగా నీ ప్రజలను మేనేజ్ చేయడం ఆయన వల్ల కాదన్నారు. పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ,  మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ లు కూడా మాట్లాడారు.
 
బాబు వల్లే వ్యవసాయం నాశనం: ఉమ్మారెడ్డి
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల రైతులు శాశ్వత రుణగ్రస్తులయ్యారన్నారు. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన ఘనుడిగా చంద్రబాబు చరిత్రలో మిగులుతారన్నారు. స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల హక్కులను కాపాడుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమం రాబోతోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు