బదిలీల జాతర | Sakshi
Sakshi News home page

బదిలీల జాతర

Published Mon, Jun 22 2015 2:40 AM

బదిలీల జాతర

- నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- కీలక పోస్టుల్లో మార్పులు ఖాయం
- మళ్లీ మొదలైన పైరవీలు
సాక్షి, విశాఖపట్నం :
బదిలీల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ బదిలీలు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం శనివారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మే 15వ తేదీ నుంచి 30వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, జూన్ 2న నవనిర్మాణ దీక్ష 3 నుంచి 8 వరకు జరిగిన ‘జన్మభూమి-మావూరు’ వంటి కార్యక్రమాల నేపథ్యంలో బదిలీలకు ప్రభుత్వమే తొలుత బ్రేకులేసింది.

జూన్ 9 నుంచి 15వ తేదీ లోపు బదిలీ తంతు ముగించాలని ఆదేశించగా, ఈలోగా జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో బదిలీలకు మళ్లీ బ్రేకుపడింది.షెడ్యూల్ ప్రకారం జూలై-7వ తేదీ వరకు కోడ్ ఉన్నప్పటికీ జిల్లాలో రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో కోడ్ ఉపసంహరిస్తూ శనివారం రాత్రే ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఆ వెంటనే బదిలీల ప్రకియను
 
నెలాఖరులోగా పూర్తిచేయాలంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హేమముని వెంకటప్ప ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇచ్చిన నిబంధనల మేరకే ఒకేచోట మూడేళ్లకు మించి పనిచేసిన వారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని, ఆ తర్వాత రిక్వస్ట్ ట్రాన్సఫర్స్‌తో పాటు పరిపాలనా సౌలభ్యంతో అవసరమైన మేరకు బదిలీలు చేసుకోవాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
ఇప్పటివరకు అందిన జాబితాల ప్రకారం జిల్లా పరిధిలో 41ప్రభుత్వ శాఖల్లో అన్ని క్యాడర్లలో కలిపి 6150 వివిధ పనిచేస్తుంటే.. వారిలో ఇప్పటి వరకు తప్పనిసరిగా బదిలీలకు గురయ్యే వారు 2,554 మంది ఉన్నట్టుగా లెక్క తేల్చారు. వీటిలో ప్రధానంగా రెవెన్యూలో 1500 మంది సిబ్బంది ఉండగా వారిలో అత్యధికంగా 985 మంది బదిలీలకు గురయ్యే వారిలో ఉన్నారు. వీరిలో 750 మంది వరకు వీఆర్వోలున్నారు. ఆ తర్వాత వ్యవసాయశాఖలో 290, జెడ్పీలో 252, పశుసంవర్ధకశాఖలో  235, పంచాయతీ డిపార్టుమెంట్‌లో 180, డీఆర్‌డీఎలో 170, బీసీ వెల్ఫేర్ లో154, సోషల్ వెల్పేర్‌లో 167, అగ్నిమాపక శాఖలో 233, పంచాయతీరాజ్‌శాఖలో 95, హౌసింగ్ కార్పొరేషన్‌లో 80, ఆయుష్‌లో 70, జిల్లా గ్రంథాలయసంస్థలో 50, మైన్స్‌లో 37 మంది బదిలీలకు గురయ్యేవారి జాబితాల్లో ఉన్నారు. ఇక మిగిలిన శాఖల్లో 10 నుంచి 25 మంది లోపు సిబ్బంది ఉండగా వారిలో మూడోవంతుకు స్థానచలనం కలుగనుంది.
 
జిల్లా వైద్య ఆరోగ్య, విద్య శాఖలతో పాటు పోలీస్, ఎక్సైజ్ వంటి శాఖలకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్యం, విద్యాశాఖల్లో బదిలీలన్నీ వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా చేపట్టాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఒకపక్క విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో  ఈ సమయంలో బదిలీలకు గురికావాల్సి రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్లతరబడి పాతు కుపోయిన వారికి స్థానచలం తప్పదని తేలిపోవడంతో వారుఉన్న చోటే కొనసాగడం లేదా.. కోరు కున్న పోస్టులను దక్కించుకునే లక్ష్యంతో పైరవీలు మొదలుపెట్టారు.

బదిలీల విషయమై ఇన్‌చార్జి మంత్రికి తుదినిర్ణయం కట్టబెట్టడంతో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు..పార్టీ ఇన్‌చార్జిల సిఫారసు లేఖలకు ఎక్కడా లేని గిరాకీ ఏర్పడింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ఊపందుకోనుంది. ఇకకేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్న తలంపుతో జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement