‘గిన్నిస్‌’ సాధనలో స్విమ్మర్‌ మృతి

23 Jan, 2017 01:42 IST|Sakshi
‘గిన్నిస్‌’ సాధనలో స్విమ్మర్‌ మృతి
  • గుండెపోటుతో మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఉమామహేశ్వరరావు
  • స్విమ్మింగ్‌లో ఇప్పటికే పలు రికార్డులు కైవసం
  • విజయవాడ(రామవరప్పాడు/తాడేపల్లి రూరల్‌): జీవితాశయమైన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం కోసం కఠోర సాధన చేస్తున్న ఓ స్విమ్మర్‌ను గుండెపోటు రూపంలో మృత్యువు కాటేసింది. ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన  లంకె ఉమామహేశ్వరరావు(46) ఆదివారం కృష్ణానదిలో సాధన చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఏపీ ఎస్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అయిన ఉమామహేశ్వరరావు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వరల్డ్‌ అమేజింగ్‌ రికార్డ్స్, గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్, రికార్డ్‌ హోల్డర్స్‌ రిపబ్లిక్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానంతో పాటు పలు పురస్కారాలను అందుకు న్నారు.

    గిన్నిస్‌  రికార్డు సాధనలో భాగంగా రోజులానే ఆదివారం ఉదయం ఈత కోసం విజయవాడ సమీప సీతానగరం వద్ద కృష్ణానదికి వెళ్లారు. ఈత సాధన చేస్తుండగా గుండె బరువుగా ఉందని ఒడ్డుకు చేరుకుని పడిపోయారు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో నేప్రాణాలు కోల్పోయారు. ఆయన విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో భార్య చంద్రకళ, కుమార్తె దివ్య, కుమారుడు శ్రీరాంతో కలసి నివసిస్తున్నారు. స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె సమీప ఓలేరు. 1994లో ఏపీఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా చేరారు.

    ప్రస్తుతం విజయవాడలో హెచ్‌సీగా ఉన్నారు. రెండు చేతులు, రెండు కాళ్లు కట్టుకొని,  గోనెపట్టాను నడుముకు తొడిగి ఈత కొట్టి గిన్నిస్‌లో స్థానం సంపాదిం చాలన్న పట్టుదలతో ఆయన  సాధన చేస్తూ  తనువు చాలించారు. ఈ వార్త తెలుసుకున్న ఎస్పీఎఫ్‌ డీఐజీ ఏసురత్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి ఉమామహేశ్వరరావు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయవాడ బస్టాండ్‌ సమీపంలోని శ్మశాన వాటికలో ఉమామహేశ్వరరావు దహన సంస్కారాలు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు