ప్రహసనంగా భూసేకరణ

17 Nov, 2014 01:49 IST|Sakshi
ప్రహసనంగా భూసేకరణ

సాక్షి, హైదరాబాద్ : ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణను టీడీపీ ప్రభుత్వం ప్రహసనంగా మార్చేసిందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. రైతులకు నచ్చజెప్పి, వారిని సంతృప్తి పరచి ఇష్టపూర్వకంగా భూమిని సేకరించే బదులు వారిని పోలీసులతో నెట్టించడం, మంత్రులు బెదిరించడం దారుణమన్నారు.
 
 రాష్ట్రంలోని రాజకీయపక్షాలేవీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే రైతుల నోళ్లు కొట్టే విధానాన్ని ప్రతిఘటిస్తున్నామని తెలిపారు. ఉమ్మారెడ్డి ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని విషయంలో రైతులను భయభ్రాంతులను చేయడంతప్ప ప్రభుత్వం తన నిర్దిష్ట విధానమేమిటో ఇప్పటివరకూ ప్రకటించలేదని విమర్శించారు. రైతులకు భయాందోళనలు కలిగించేలా సేకరణ అని, ల్యాండ్‌పూలింగ్ అని రోజుకో మాట చెప్పేకంటే అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమినే తీసుకోవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.  శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సును తుంగలో తొక్కారని విమర్శించారు. మంత్రులు గ్రామాలకు వెళ్తుంటే అసలు ల్యాండ్‌పూలింగ్ అంటే ఏమిటని  రైతులు అడుగుతున్నారన్నారు.
 
 సింగపూర్ చిన్నదేశమైనా వారి తలసరి ఆదాయం 20 రెట్లు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారని, ఈ రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించింది ఆయనే కనుక ఏపీ తలసరి ఆదాయాన్ని ఆస్థాయికి ఎందుకు పెంచలేకపోయారో జవాబు చెప్పాలని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాలను పూర్తిగా విస్మరించారని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదని తప్పుపట్టారు. వైఎస్సార్‌సీపీ బృందం ఈ నెల 17న తుళ్లూరు పరిసర గ్రామాల్లో పర్యటిస్తుందని ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు