Sakshi News home page

‘ఆరోగ్య కార్డులు’ అక్కరకు వచ్చేనా?

Published Mon, Nov 17 2014 1:50 AM

employees health cards

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యంపై భరోసా లేకుండాపోతోంది. ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల ద్వారా నగదు రహిత చికిత్సలను అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యకార్డులను ఇస్తామని ప్రకటించి వాటిని జారీ చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో వందల రూపాయలు వెచ్చించి ప్రైవేటు నెట్ సెంటర్ల ద్వారా వివరాలను అప్‌లోడ్ చేసి ఆరోగ్యకార్డులను తీసుకున్నారు. అయితే అవి గుర్తింపుకార్డులుగానే మిగిలిపోయాయి. అప్పటి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరోగ్య కార్డులు పనికి రాకుండా పోగా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌నే కొనసాగించాల్సి వచ్చింది.
 
 కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామంటూ ఆరోగ్యకార్డులు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్నిచోట్ల ఈ కార్డులను విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. ఈ కార్డులు కూడా గుర్తింపుకార్డులుగానే ఉండిపోయే పరిస్థితి ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి కార్డులు ఇచ్చేప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి ధరలను నిర్ణయించాల్సి ఉంది. అటువంటి దేమీ చేయకుండా కార్డులు జారీ చేయడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యకార్డులు ద్వారా చికిత్సను అందించలే మని చేతులెత్తేస్తున్నాయి. అయినా ప్రభుత్వ పెద్దల్లో మాత్రం స్పందన కన్పించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటువంటి ప్రకటనలు చేసిన తరువాతైనా వారితో చర్చించి ఉంటే సమంజసంగా ఉండేది. అవేమి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
 ఈ నెల 30వ తేదీ తరువాత మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఉండదని, డిసెంబరు 1 నుంచి ఆరోగ్యకార్డుల ద్వారానే చికిత్సలు పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్డుల ద్వారా ఆరోగ్యసేవలు అందే అనుకూల పరిస్థితులు కన్పించక పోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఈ కార్డుల ద్వారా చికిత్సలు పొందేందుకు రూ. 50 నుంచి రూ.100 వరకు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరికైనా ఉచితంగా వైద్యసేవలు అందిస్తారని, అటువంటప్పుడు తాము ఆరోగ్యకార్డులు పట్టుకు వెళ్లి రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించడం వల్ల ఉపయోగమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 30 లోగా కార్డుల ద్వారా వైద్యసేవలు పొందేందుకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపట్టాలని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
 
 పీఆర్సీలోనూ కాలయాపన ధోరణే...
 ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన ధోరణిని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలించిన తరువాత గత ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించింది.
 అటు తరువాత వచ్చిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలుపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా మరో సబ్ కమిటీని వేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కాలయాపన చేసేందుకే తప్ప చిత్తశుద్ధితో చేసిన పనికాదని వారంటున్నారు. దీనిపైన కూడా ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల హెచ్చరికలకు తల వంచుతుందో తన ధోరణిని కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement