స్టేషన్లలో సెటిల్‌మెంట్లు సహించను

28 Jul, 2014 03:07 IST|Sakshi
స్టేషన్లలో సెటిల్‌మెంట్లు సహించను

తప్పుడు ఫిర్యాదులు చేస్తే కౌంటర్ కేసులు
కొత్త ఎస్పీ కొల్లి రఘురామ్‌రెడ్డి హెచ్చరిక

ఏలూరు( ఫైర్‌స్టేషన్ సెంటర్) : స్టేషన్లలో సెటిల్‌మెంట్లు, దళారులతో కుమ్మక్కు వంటి వ్యవహారాలు చేస్తే సంబంధిత స్టేషన్ అధికారులపై చర్యలు తప్పవని ఆదివారం బాధ్యతలు చేపట్టిన ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు సన్నగిల్లిన విషయం తెలిసిందని, పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఎవరైనా అడ్డదారుల్లో వెళితే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. తప్పుడు ఫిర్యాదుచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై కౌంటర్ కేసులు పెడతామని చెప్పారు.
 
ప్రాధాన్యతా అంశాలు నాలుగు
 తాను నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని ఎస్పీ తెలిపారు. న్యాయం చేయాలని స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదీ నుంచి ఫిర్యాదును స్వీకరించి వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పారు. రాజీపడాలనుకునే కక్షిదారులు లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకోవాలన్నా రు. కానీ కేసు నమోదు చేయకుండా సెటిల్‌మెంట్ చేస్తే సంబంధిత అధికారిపై చర్యలు ఉంటాయన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై దృష్టి సారించి వారికి పూర్తి రక్షణ కల్పించడం తన ధ్యేయమన్నారు. జిల్లా నుంచి మహిళల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

ఆర్థిక నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుం టామని చెప్పారు. దొంగతనాల కేసుల్లో బాధితులకు సొమ్ము రికవరీ చే సి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకుగాను ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. దొంగనోట్లు, డబ్లింగ్‌కరెన్సీ ముఠాల కార్యకలాపాలను నిర్మూలించటానికి నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
 పోలీసుల సంక్షేమానికి కృషి
 
పోలీసుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు. బాధ్యతల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందిలేకుండా సిబ్బంది అందరికీ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జిల్లాలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేయించి సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. పోలీస్ శాఖలో పౌర సంబంధాల వ్యవస్థను మెరుగుపరుస్తానని తెలిపారు.
 
శుభాకాంక్షలు..
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రఘరామిరెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షులు తెలిపారు. కలిసిన వారిలో నాయ్యవాది బీవీ కృష్ణారెడ్డి, ఏఎస్‌డీ రామకృష్ణ, ఏఆర్ డీఎస్పీ కె.కోటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సరిత, ఏఆర్ ఆర్‌ఐ వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ, టూటౌన్ సీఐ వై.సత్య కిషోర్, త్రీటౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, పలువురు ఎస్సైలు ఉన్నారు.

మరిన్ని వార్తలు