సెల్ఫీ సరదా.. ఎంత పని చేసింది!

17 Jan, 2017 08:09 IST|Sakshi
సెల్ఫీ సరదా.. ఎంత పని చేసింది!
  • ఆయిల్‌ ట్యాంకర్‌పైకి ఎక్కి ఫొటో తీయించుకోబోయి విద్యుత్‌ షాక్‌కు గురైన వైనం
  • తీవ్రగాయాల పాలైన గీతం వర్సిటీ విద్యార్థి
  • అరకులోయ: ఫొటో సరదా..ఆ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. ఆగి ఉన్న గూడ్స్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ పైకి ఎక్కి ఫొటో తీయించుకోవాలన్న కోరిక అతడిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఆటవిడుపు కోసం నలుగురు స్నేహితులతో అరుకులోయకు వచ్చిన హెండ్రీ జోన్స్‌ (20) సోమవారం ఉదయం అరకు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్‌ రైలు పైకెక్కి ఫొటో తీయించుకోవాలనుకున్నాడు. గార్డు బోగీ పక్క ఉన్న గూడ్స్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ పైకి ఎక్కి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయిన అతడిని చూసి చనిపోయాడనుకొని అక్కడకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు.

    విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అతడిని పరిశీలించగా ఊపిరితో ఉండటాన్ని గుర్తించి అరుకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం విశాఖలోని కింగ్‌జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోన్స్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, క్షతగాత్రుడు జోన్స్‌ విశాఖలోని మద్దిలపాలెం నివాసి. గీతం వర్సిటీలో బీటెక్‌ మెకానికల్‌ బ్రాంచిలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు