ధరలతో సామాన్యులకు దడ

2 Jan, 2015 05:15 IST|Sakshi
ధరలతో సామాన్యులకు దడ

- నషాలాన్ని అంటుతున్న పచ్చిమిరప  ఘాటెక్కిన ఉల్లిపాయ
- మార్కెట్‌లో వ్యాపారుల, దళారుల మాయాజాలం
- నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్న ధరల మానిటరింగ్ కమిటీ

కడప అగ్రికల్చర్ : మార్కెట్‌లో కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలిజనానికి ఈ ధరలు కలవరం పుట్టిస్తున్నాయి. నెల క్రితం 10-12 రూపాయాల్లోపు ధర ఉన్న కూరగాయలు నేడు రూ.20 నుంచి 60కి చేరుకున్నాయి. ధరలు రెట్టింపు అవుతుండటంతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు.
 
దిగుబడి తగ్గడమే కారణం
చలిగాలులు పెరగడంతో పురుగులు, తెగుళ్లు విజృంభణ ఎక్కువై  కూరగాయల దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు అడుగంటిన భూగర్భజలాల వల్ల నీటి తడులు సక్రమంగా అందకపోవడంతో దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. అలాగే కూరగాయల నాణ్యత కూడా సరిగా ఉండటం లేదు. బోరుబావుల్లో నీరు రోజురోజుకు తగ్గిపోతోందని, ఈనేపథ్యంలో కొత్తగా కూరగాయల సాగు చేపట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
మార్కెట్‌లో ధరలు ఇలా..
ప్రధానంగా 10 రోజుల కిందట టమాట కిలో రూ.5 నుంచి రూ.10, పచ్చిమిరప రూ.12 ఉండగా నేడు రూ.24 పలుకుతోంది. వంకాయ (నాటు రకం) కిలో రూ.10 ఉండగా నేడు రూ.18, కాకర కిలో రూ.15 నుంచి రూ.20కి చేరుకుంది. చిక్కుడు కిలో 20 రూపాయల నుంచి 35 రూపాయలకు చేరుకుంది. బెండ కిలో రూ.16 నుంచి రూ. 20కు చేరింది. అలాగే క్యాబేజి కిలో రూ.18 నుంచి రూ.24 పలుకుతున్నాయి.

అదే విధంగా క్యారెట్ కిలో రూ.20 నుంచి 32కి చేరింది. బంగాళదుంప కిలో రూ.20 ఉండగా నేడు రూ.30, ఉల్లిపాయలు కిలో రూ.15 పలుగా నేడు కిలో. 20-30 మధ్య ధరలున్నాయి. అలాగే బీన్స్ రూ. 20 నుంచి 36, అల్లం రూ. 48 ఉండగా ఇప్పుడు రూ.60 ధర పలుకుతున్నాయి.
 
దళారుల మాయాజాలం..
మార్కెట్‌కు స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  జిల్లాలో 29 లక్షల మంది ప్రజలు ఉండగా రోజుకు వినియోగదారులు అన్ని రకాల కూరగాయలను కలిపి 40 టన్నుల కూరగాయలను వాడుతున్నారని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. చలిగాలుల వల్ల, అడుగంటిన భూగర్భజలాల వల్ల మార్కెట్‌కు కూరగాయలు సరిగా రాలేదని సాకు చూపుతూ ధరలను అమాంతగా పెంచుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ కూరగాయలు దొరకనందున పొరుగున ఉన్న కర్నూలు, చిత్తూరు జిల్లాలకు, పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి కూడా కూరగాయలు తెప్పిస్తున్నందున కూరగాయ ధరలు కాస్త పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. రవాణా, కమీషన్లు, ఇతర ఖర్చులు మీద పడతాయని వాటిని ఈ ధరల్లో కలుపుతామని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకాస్తా పెరుగుతాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు