నేటి నుంచి కరువు మండలాల్లో పంట నష్టంపై సర్వే | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కరువు మండలాల్లో పంట నష్టంపై సర్వే

Published Fri, Jan 2 2015 5:17 AM

crop Loss on the survey at drought zones

గ్రామస్థాయి వీఆర్వో, ఏఈఓ, పంచాయతీ సెక్రటరీలతో టీమ్
కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రాంతాలుగా గుర్తించిన 12 మండలాల్లో శుక్రవారం నుంచి పంట నష్టంపై సర్వే మొదలు కానుంది. గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ సెక్రటరీ సర్వే చేయనున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం ఆధారంగా 34 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఇందులో కల్లూరు, కోడుమూరు, ప్యాపిలి, వెల్దుర్తి, మంత్రాలయం, నందికొట్కూరు, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించింది.

జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో లేని గూడూరు, డోన్, కోసిగి, ఉయ్యాలవాడ మండలాలను కూడా ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించడం విశేషం. 12 మండలాల్లో ఈనెల 2 నుంచి సర్వే చేపట్టి 9వ తేదీకి పూర్తి చేస్తారు. తర్వాత గ్రామ పంచాయతీలో పెట్టి గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాత డేటా ఎంట్రీ చేసి ఈనెల 16వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి నివేదికలు వచ్చేలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

వర్షాధారంపై సాగు చేసిన వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను గ్రామస్థాయిలో సర్వే చేసే టీమ్‌కు ఇవ్వాల్సి ఉంది. రెండు హెక్టార్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. 50 శాతం.. ఆపైన దెబ్బతిన్న పంటలను మాత్రమే నమోదు చేస్తారు. 2011, 2012 సంవత్సారాల్లో కరువు ఏర్పడినప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు  తీసుకున్నట్లుగా జేడీఏ వివరించారు.

కరువు మండలాల్లో వర్షాభావం వల్ల పంటలను కోల్పోయిన రైతులు వెంటనే సంబంధిత గ్రామ కమిటీలకు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను అందజేయాలని తెలిపారు. జాబితాలను పంచాయతీలో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి..  పరిష్కరించిన తర్వాతే డేటా ఎంట్రీ మొదలవుతుందన్నారు. కాగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలోని 26 మండలాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటిని కూడా కరువు ప్రాంతాలుగా గుర్తించేలా జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

Advertisement
Advertisement