కొండను తొలిచి.. దారిగా మలిచి 

24 Aug, 2019 06:57 IST|Sakshi
చెర్లోపల్లె రైల్వే సొరంగాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌లో టన్నెల్‌ నిర్మాణం

దక్షిణభారతదేశంలోనే పెద్దదిగా గుర్తింపు

నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరిశీలన

ప్రత్యేకరైలులో వీక్షణ

సాక్షి, రాజంపేట: కొండ కోనల్లో, గుహల్లో రైలు ప్రయాణం మరుపురాని అనుభూతి. ఈ మధ్యే అతిపెద్ద రైల్వే టన్నెల్‌ను కశ్మీర్‌లో ప్రారంభించారు. అలాంటి సాంకేతిక అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లోనూ సాకారమైంది. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్‌ మార్గంలోని వెలుగొండ అడవుల్లో  7.560 కిలోమీటర్ల పొడవు తో దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్‌ టన్నెల్‌ మెథడ్‌తో సాంకేతిక పనులు శరవేగంతో పూర్తి చేశారు. టన్నెల్‌లో నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి రాజధానికి రెండో రైలుమార్గంగా ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్‌ ఆవిష్కృతమైంది. వెలుగొండ అడవుల్లో నెల్లూరు–వైఎస్సార్‌ జిల్లా సరిహద్దులో ఉన్న కొండల్లో నిర్మితమై అందుబాటులోకి వచ్చిన టన్నెల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం పరిశీలించనున్నారు. 

టన్నెల్‌ నిర్మాణం ఇలా...
వెంకటాచలం–ఓబులవారిపల్లె మార్గంలో 7,560 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్‌) ఉంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండలను తొలిచి దారిగా మలిచారు. మొదటిది 6.600 కిలోమీటర్లు. ఆపై కొంత మైదానప్రాంతం వస్తుంది. వెంటనే 0.960 కి.మీ పొడవున మరో టన్నెల్‌ ఉంటుంది. ఎత్తు 8  , వెడల్పు 7 మీటర్ల చొప్పున ఆధునిక యంత్రాలతో పనులు సాగుతున్నాయి. రూ.4 కోట్లు విలువచేసే  యంత్రం ద్వారా కొండను తొలగించారు. 2006లో అప్పటి రైల్వేమంత్రి నితీశ్‌కుమార్‌ ద్వారా ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్‌కు పచ్చజెండా ఊపారు. నూతన రైలుమార్గంలో చెర్లొపల్లె సమీపంలోని పెనుశిల అభయారణ్యంలో రూ.470 కోట్ల వ్యయంతో టన్నెల్‌ అందుబాటులోకి వచ్చింది. కృష్ణపట్నం రైల్వేలైనులో అంతర్భాగమైన టన్నల్‌లో కిలోమీటర్‌కు రూ.47కోట్లు వ్యయం చేశారు. మొదటి,రెండో టన్నెళ్లు పూర్తయ్యాయి.కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు.  

ఉపరాష్ట్రపతి మానసపుత్రిక ఈలైను..
ఉపరాష్ట్రపతి మానసపుత్రికైన ఈ రైల్వేలైన్‌ను శనివారం పరిశీలించనున్నారు. ఎన్‌డీఏ హయాంలో దీని మంజూరుకు తన హోదాలో కృషిచేశారు. దీనివల్ల గుంతకల్‌ డివిజన్‌ నుంచి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఓబులవారిపల్లె– రేణిగుంట–గుడూరు సెక్షన్‌లో రద్దీకూడా తగ్గనుంది. 2005–2006లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఏపీలోని నెల్లూరు, కడప జిల్లాల మధ్య   సాగుతోంది.  

నేడు చెర్లోపల్లికి ఉపరాష్ట్రపతి రాక
చిట్వేలి: ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయడు శనివారం జిల్లాకు రానున్నారు. చిట్వేలి మండలం చెర్లోపల్లె గ్రామం వద్ద రైల్వే సొరంగ మార్గాన్ని ఆయన అధికారికంగా పరిశీలించనున్నారు.  ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం నుం చి ఉపరాష్ప్రపతి రెండు భోగీల రైలులో సాయంత్రం 4 గంటల సమయంలో చెర్లోపల్లెకు చేరుకుంటారు. 15 నిమిషాల పాటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత వేంకటాచలానికి పయనమవుతారని అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి  తెలిపారు. రైల్వేపరంగా ప్రారంభానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని రైల్వే ప్రాజెక్టు డైరెక్టర్‌ వాసుదేవ్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు