ఎక్సైజ్‌  హెచ్‌సీపై ఎమ్మెల్యే రజని ఆగ్రహం 

8 Apr, 2020 08:59 IST|Sakshi

సాక్షి, చిలకలూరిపేట: ‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ లంచాలు అడుగుతున్న ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ డి.రామ్‌ప్రసాద్‌ మాట్లాడిన కాల్‌ రికార్డింగులు ఎమ్మెల్యే దృష్టికి రావటంతో  ఆమె చిలకలూరిపేట ఎక్సైజ్‌ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులను ప్రశ్నించగా ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఆర్‌.వి.వి.ప్రసాద్‌ రికార్డింగ్‌లోని వాయిస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రామ్‌ప్రసాద్‌దని తెలపగా తనదేనని అతను కూడా అంగీకరించారు. ప్రభుత్వ స్ఫూర్తిని కాపాడాల్సిన వారే ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడటం తగదని హితవు పలికారు.  అనంతరం ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు హెడ్‌కానిస్టేబుల్‌ తీరుపై చర్యలు తీసుకోవాలని ఫోన్‌ చేసి చెప్పారు

మద్యం నిల్వలు మాయం!
నరసరావుపేట టౌన్‌: మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసే కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్కడ పనిచేసే వర్కర్లు, పోలీస్‌ సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలను దారిమళ్లించారు. ఎక్సైజ్‌ అధికారులు మంగళవారం సీల్‌ వేసి ఉన్న నాలుగు మద్యం దుకాణాలను పరిశీలించగా అందులో సుమారు రూ.13 లక్షల రూపాయల మద్యం బాటిళ్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వివరాల్లొ కెళితే.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం గత నెల 22వ తేదీన సీల్‌ వేసింది. అయితే నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం, రొంపిచర్లలోని దుకాణంలో ఇటీవల మద్యం నిల్వలు చోరీ జరిగిన విషయం విదితమే.

రెండు సంఘటనలతో ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తమై మిగిలిన మద్యం దుకాణాలను మంగళవారం పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని మద్యం దుకాణంలో రూ.6.80 లక్షల మద్యం నిల్వలు కనిపించలేదు. గుంటూరు రోడ్డులోని మద్యం దుకాణంలో తనిఖీ చేయగా రూ.4.92 లక్షల మద్యం బాటిళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ములకలూరు, రావిపాడు గ్రామాల పరిధిలో ఉన్న రెండు మద్యం దుకాణాలను పరిశీలించగా రూ.64 వేల రూపాయల మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు తేల్చారు. నాలుగు మద్యం దుకాణాల్లో సుమారు రూ.13 లక్షల విలువైన మద్యం నిల్వలు మాయమైనట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆయా దుకాణాల్లో పనిచేసే సూపర్‌వైజర్‌లను బాధ్యులను చేసి వారి నుంచి నగదు రాబట్టి, క్రిమినల్‌ కేసులు నమోదుకు చర్యలు తీసుకుంటామని ఈఎస్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌ సీఐలు కర్ణబాబు, మారయ్యబాబు, ఎస్‌ఐ ప్రసాద్, టూటౌన్‌ ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.  

ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌ 
సాక్షి, గుంటూరు: అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో స్టాక్‌ దొంగిలించిన వారికి సహకరించిన కారణాలతో ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ ఎక్సైజ్‌ డీసీ (ఎఫ్‌ఏసీ) శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. ఇటీవల నరసరావుపేటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొందరు స్టాక్‌ను దొంగిలించారు. ఈవ్యవహారానికి సహకరించిన సత్యనారాయణ, చిలకలూరిపేటలో బెల్టుషాపుల నుంచి డబ్బు వసూలు చేస్తూ అవినీతి  ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.రామ్‌ప్రసాద్‌పై నేరం నిర్ధారణ కావడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.  

మరిన్ని వార్తలు