కొండను తవ్వి.. ఎలుకను పట్టి

6 Dec, 2018 11:59 IST|Sakshi

విజిలెన్స్‌ అధికారుల     తీరుపై సర్వత్రా విమర్శలు

దాడుల సమాచారం     ముందుగానే లీక్‌?

అప్రమత్తమవుతున్న     వ్యాపారులు

నామమాత్రంగా బియ్యం సీజ్‌

ఉరవకొండ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ అండదండలతో నిరాటంకంగా సాగుతోంది. కళ్లముందే తరలిపోతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోతున్నారు.  

ఉరవకొండ: పేదలకందించే చౌక బియ్యం అక్రమ మార్గంలో కర్ణాటకకు తరలిపోతోంది. బియ్యం దందా భారీ స్థాయిలో జరుగుతుంటే విజిలెన్స్‌ అధికారులు తూతూమంత్రంగా 20 నుంచి 30 బస్తాలు పట్టుకుని మిన్నకుండిపోతున్నారు. ఉరవకొండకు చెందిన బియ్యం వ్యాపారులు తమ జోలికి రాకుండా ఏకంగా విజిలెన్స్‌ అధికారులకే మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత సూచించిన విధంగానే విజిలెన్స్‌ దాడుల సమాచారాన్ని అధికారులు ముందస్తుగా చేరవేస్తున్నారని తెలిసింది. అంతే నిమిషాల్లో వ్యాపారులు బియ్యం అక్రమ నిల్వలను మరోచోటుకు మార్చుకుంటున్నట్లు సమాచారం. బుధవారం విజిలెన్స్‌ అధికారులు మూడు చోట్ల రెండు బృందాలుగా దాడులు చేసినా 100 బస్తాలు మాత్రమే దొరికాయి. ముందస్తు సమాచారం ఉండటంతో వ్యాపారులు ముగ్గురూ 200 క్వింటాళ్ల బియ్యాన్ని మరో రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసింది.

ఐదు బియ్యం అక్రమ నిల్వ కేంద్రాలు
బియ్యం దందాను టీడీపీ నేత ఆదేశాలతో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఉరవకొండ పట్టణంలో గుంతకల్లు రోడ్డు వద్ద మల్లేశ్వర థియేటర్‌ వెనుక వైపు గోడౌన్, ఈశ్వరమ్మ ఆలయం వెనుక, చెంగల వీధిలో, బుసప్ప జిన్నా, కణేకల్లు క్రాస్‌ వద్ద గదుల్లో బియ్యాన్ని నిల్వచేసి రాత్రికి రాత్రే తరలిస్తున్నారు.

రోజూ 200 క్వింటాళ్ల అక్రమ రవాణా
ఉరవకొండ నుంచి రెండు లారీల లోడు బియ్యం కర్ణాటకకు తరలిస్తున్నారు. రోజుకు దాదాపు 200 క్వింటాళ్ల బియ్యాన్ని బళ్లారి, చెళ్లికెర మీదుగా చిక్‌బళ్లాపూర్‌కు తరలిస్తున్నారు. ఉరవకొండలో కిలో రూ.12 నుంచి రూ.13కు చౌక బియ్యాన్ని కొని కర్ణాటకలో రూ.20 నుంచి రూ.23 వరకు విక్రయిస్తున్నారు. ఉరవకొండలో బియ్యం అక్రమ దందా టీడీపీ నేత కనుసన్నల్లో కొనసాగుతుండటం వల్ల అధికారులు అడ్డుకోవడానికి సాహసం చేయడం లేదనేది బహిరంగ రహస్యం.  

విజిలెన్స్‌ అధికారుల దాడులు
ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐలు రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్‌చౌదరి, ఎస్‌ఐలు రామకృష్ణ, శంకర్, డీసీటీఓలు సుబ్బారెడ్డి, జిలాన్‌బాషాలు రెండు బృందాలుగా ఏర్పడి మూడు చోట్ల దాడులు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  విజిలెన్స్‌ డీఎస్పీ మాట్లాడుతూ లత్తవరం రోడ్డులో 40 బస్తాలు, బుసప్ప జిన్నాలో ఒకచోట 33, మరోచోట 27 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం వంద బస్తాలను స్టాక్‌ పాయింట్‌కు తరలించినట్లు చెప్పారు. దీంతోపాటు దాడుల్లో పీడీఎస్‌ బియ్యం సరఫరా చేసే 56 సంచులు కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు.   

అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు
ఉరవకొండ: ఉరవకొండ కేంద్రంగా బియ్యం అక్రమంగా తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్‌అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ రామాంజినేయులు తెలిపారు. బుధవారం విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసిన బియ్యం అక్రమ నిల్వలను పరిశీలించేందుకు ఆయన ఉరవకొండకు వచ్చారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉరవకొండకు చెందిన రెవిన్యూ, పోలీసు శాఖ వారికి కూడా అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. అక్రమంగా తరలించే వారు రెండుసార్లు పట్టుబడితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్‌బాషా, ఎస్‌ఐ, సీఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు