మెడికల్‌ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

13 Dec, 2018 13:06 IST|Sakshi
మందులను తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

నెల్లూరు(క్రైం):  జిల్లాలోని మారుమూల ప్రాంతా ల్లో ఉన్న మెడికల్‌ షాపుల్లో జిల్లా విజిలెన్స్‌ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు విజిలెన్స్‌ ఎస్పీ ఎస్‌. శ్రీకంఠనాథ్‌రెడ్డి, కార్మిక, డ్రగ్స్‌ కంట్రోల్, ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారుల సహకారంతో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకంఠనా«థ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గూడూరు డివిజన్‌లో 8 దుకాణాలు, నెల్లూరు డివిజన్‌లో 10 దుకాణాలు, కావలి డివిజన్లో 5 దుకాణాలు, ఆత్మకూరు డివిజన్లలో 6 దుకాణాలు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ప్రమాణాలతో తయారు చేయబడిన ఔషధాలు అందుబాటులో ఉండేందుకు, కాలం చెల్లిన ప్రమాణాలు పాటించని, మానవ జీవితాన్ని కుదేలు చేయగల హాని కారక డ్రగ్స్‌ పూర్తి నియంత్రణలో ఉండేలా చూసేందుకు తనిఖీలు నిర్వహించనట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నారా?, బ్రాండ్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్నారా లేదా, శీతోష్ణ స్థితిలో ఉంచాల్సిన ఔషధాలు ప్రిజ్‌లో ఉంచుతున్నారా లేదా, రిజిస్టర్లు మెయింటెనెన్స్‌ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామన్నారు.

మెడికల్‌ షాప్‌పై విజిలెన్స్‌ దాడులు  
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లిలో లక్ష్మి మెడికల్‌ షాపుపై బుధవారం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించా రు. విజిలెన్స్‌ సీఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మెడికల్‌ షాపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మెడికల్‌ షాపులో నిబంధనలు పాటించడం లేదన్నారు. ఫార్మాసిస్ట్‌ ద్వారా మందులు విక్రయించాల్సి ఉండగా, ఫార్మాసిస్ట్‌ లేరన్నారు. స్టాక్‌ రిజిస్టర్, లేబర్‌ లైసెన్స్, ఫుడ్‌లైసెన్స్, పర్చేస్‌ వివరాలతో ఉండాల్సిన రిజిస్టర్లు సక్రమంగా లేవన్నారు. జనరిక్‌ మెడిసిన్స్‌ వేరుగా విక్రయించాల్సి ఉన్నప్పటికి, అలా జరగడం లేదన్నారు.    పలు రకాల మందులను గుర్తించామన్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి తద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు. దాడుల్లో సీఐతో పాటు డీసీటీఓ విష్ణురావు, ఏఎల్‌ఓ రాజశేఖర్, హెడ్‌కానిస్టేబుల్‌ రహీం, కానిస్టేబుల్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు