నారా హమారా.. నహీ

31 Aug, 2018 12:26 IST|Sakshi

ప్రభుత్వం తీరుపై ముస్లింల                ఆగ్రహం

యువకుల అరెస్టు అక్రమం అంటూ నిరసన

కర్కశంగా హక్కును               కాలరాస్తున్నారని మండిపాటు

సాక్షి నెట్‌వర్క్‌ : ప్రశ్నించడమే పాపామా.. ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం కనీసం నిరసన తెలిపే స్వాతంత్య్రం కూడా లేదా.. తమకిచ్చిన హామీలను నెరవేర్చండంటూ శాంతియుతంగా తమ ఆవేదనను వెలిబుచ్చిన ముస్లిం యువతను అత్యంత కర్కశంగా అరెస్ట్‌ చేసిన టీడీపీ ప్రభుత్వ తీరుపై ముస్లిం లోకం భగ్గుమంటోంది. గాంధేయ విధానాల నుంచి గ్రహించిన స్వార్థరాహిత్యం.. పాశ్చాత్య దేశాల అభ్యాసం నుంచి సంక్రమించిన ప్రేరణతో రూపొందించిన పాలనావ్యవస్థను తుంగలో తొక్కేస్తూ సాగిస్తున్న అరాచకాలకు తలొగ్గేది లేదని నినదిస్తోంది. అరెస్ట్‌ చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తోంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరిస్తోంది.

రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం
నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ముస్లింలకు చంద్రబాబు చేసేందేమి లేదు. ఇప్పుడు నారా హమారా, టీడీపీ హమారా పేరుతో ముస్లింలను మరొసారి మభ్యపెట్టేందుకు కపట నాటకాలు ఆడుతున్నారు. హిందువులకు టోపీలు పెట్టి సభకు తీసుకువచ్చారు. సభలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన ముస్లిం యువకులను అమానుషంగా అరెస్ట్‌ చేసి పోలీసులతో కొట్టించారు. అరెస్ట్‌ చేసిన యువకులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం.    – ఎండీ. గౌసాని, వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి

హక్కులు కాలరాస్తారా?
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను టీడీపీ సర్కారు కాలరాస్తుంది. నాలుగేళ్లుగా తాము మోసపోయిన తీరుపై శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేసిన ముస్లింలను టీడీపీ సర్కారు అన్యాయంగా అరెస్టు చేయించి అక్రమ కేసులు బనాయించింది. తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేయాలి. మంత్రి వర్గంలో ఒక్క ముస్లిం కూడా లేని టీడీపీ సర్కారు ఎన్ని కబుర్లు చెప్పినా నమ్మే స్థితిలో ముస్లింలు లేరని అర్ధం చేసుకుంటే మంచిది. – షేక్‌ చిన్నా, కృష్ణాజిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ వైస్‌ చైర్మన్,ఈడుపుగల్లు, కంకిపాడు

అడగడమే పాపామా..
తమకు సక్రమంగా పథకాలు అందడం లేదని ప్రశ్నించిన 8 మంది యువకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయడం దుర్మార్గమైన చర్య. తమకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించిన పాపానికి కఠిన తరమైన సెక్షన్‌లపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపడమేనా ముస్లిం సమాజానికి మీరిచ్చే గౌరవం. ఎవరైనా హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే వారికి రాజకీయరంగు పులిమి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అనడం సిగ్గుచేటు. నాలుగేళ్లగా ముస్లింలకు చేసిందేమి లేదు. కనీసం మంత్రివర్గంలోస్థానం కూడాకల్పించలేదు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదం.– ముఖ్తార్‌ అలీ, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

హేయమైన చర్య..
ముస్లింలకు టీడీపీ ఇచ్చిన వాగ్దానాలను గుర్తుచేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన నంద్యాలకు చెందిన ముస్లిం యువకులపై ఉక్కుపాదం మోపడం హేయమైన చర్య. లేనిపోని కేసులు వారిపై బనాయించి భయబ్రాంతులకు గురిచేయడం చంద్రబాబుకు తగదు. టీడీపీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు నిజమైన ముస్లింలు అయితే అరెస్టులను ఖండించాలి.
– మీరా హుస్సేన్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆజాద్‌ ముస్లిం ఆర్గనైజేషన్‌

మరిన్ని వార్తలు