అకటా.. తాగునీటికి కటకట..!

4 Jul, 2018 08:43 IST|Sakshi
గుర్రంకొండ మండలం వంకాయలవారిపల్లెలో వ్యవసాయ బోరు వద్ద తాగునీరు తెచ్చుకుంటున్న జనం

వర్షాకాలం వచ్చినా గొంతెండుతున్న పల్లెలు

పట్టించుకోని అధికారులు

వర్షాకాలం ప్రారంభమైనా పల్లెలు దాహార్తితో అల్లాడుతున్నాయి. తాగునీటి కోసం కొన్ని గ్రామాల్లో ట్యాంకులను ఆశ్రయిస్తుండగా, ఇంకొన్ని గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చాలా గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు లేక డైరెక్ట్‌ పంపింగ్‌ చేస్తుండడంతో కరెంటు ఉన్నపుడే నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో మోటార్లు, తాగునీటి బోర్లు మరమ్మతులకు గురై నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

పలమనేరు: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 పంచాయతీలుండగా 500దాకా గ్రామాలున్నాయి. ఇందులో 55 గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  పలమనేరు మండలంలో పాలమాకులపల్లి, కమాలపురం, నడిమిదొడ్డిపల్లి, ఊసరపెంట, కృష్ణాపురం, సుబ్బనాయుడు ఇండ్లు, తొప్పనపల్లి తదితర గ్రామాల్లో నీటికి సమస్యలు తప్పడం లేదు. బైరెడ్డిపల్లి మండలంలోని బేలుపల్లి, గంగవరం మండలంలో పెద్ద ఉగిని, పెద్దపంజాణిలో అప్పినపల్లి, పెద్దవెలగటూరు తదితర గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందిగా ఉంది.

తాగునీటి సమస్య తాండవం              
పీలేరు: పీలేరు మండలంలో పీలేరుటౌన్, ఇంది రమ్మ కాలనీ తోపాటు కావలిపల్లె, జాండ్ల పంచా యతీల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. కేవీపల్లె మండలంలో కుమ్మరపల్లె, తోటిహరిజనవాడ, రాములవారిపల్లె, గర్నిమిట్ట తదితర గ్రామాల్లో సమస్య అధికం. గుర్రంకొండ మండలంలోని రామాపురం, వంకాయలవారిపల్లె, గంగిరెడ్డిగారిపల్లె, రెడ్డివారిపల్లె, మామిళ్లవారిపల్లెలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. ఎగువ అమిలేపల్లి, టి.రాచపల్లె, కొత్తపల్లె, మర్రిపాడు, బోడుమల్లువారిపల్లె, మర్రిపాడు, భూమక్కవారిపల్లె, దళితవాడ, శ్రీనివాసపురం, నడిమికండ్రిగ, గెరికుంటపల్లె గ్రామాల్లోని తాగునీటి బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. వాల్మీకిపురం మండలంలో నగిరిమడుగు, బురుజుగడ్డ, కొత్తపల్లె, దిగువబూడిదవేడు, సాకిరేవుపల్లె, విఠలం కుందేలువారిపల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కలికిరి మండలంలో గుండ్లూరు, మల్‌రెడ్డిగారిపల్లె, చెరువుముందరకురవపల్లె, కొటాల, మహల్‌కొత్తపల్లె, కలికిరి ఇందిరిమ్మ కాలనీ, జంగంపల్లె, కర్రేవారిపల్లెలో సమస్య జటిలంగా ఉంది.

తాగునీటి సమస్యపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు..
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలంలోని మోటుమల్లెల గ్రామ పంచాయతీలోని వడ్డేవాండ్లపల్లె, వంకిరెడ్డిగారిపల్లె, పెద్దమల్లెల గ్రామంలోని దుస్సావాండ్లపల్లెలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే చిచ్చిలివారిపల్లె పంచాయతీలోని రావిళ్లవారిపల్లె, లోకవారిపల్లె గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. రావిళ్లవారిపల్లెలో తాగునీటి సమస్యపై 15 రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే వంకిరెడ్డిగారిపల్లెలోనూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారం రోజుల క్రితం గ్రామంలో పర్యటించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ తాగునీటి బోరు వేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు.

వరదయ్యపాళెంలో..
వరదయ్యపాళెం: మండలంలోని పెద్దపాండూరు పంచాయతీ  వెంగారెడ్డికండ్రిగ దళితవాడ, చిన్నపాండూరు పంచాయతీ  రామలక్ష్మమ్మ కండ్రిగలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వెంగారెడ్డికండ్రిగలో రెండునెలల క్రితం బావిలో పూడిక పేరుకుపోవడంతో మోటార్లు కాలిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అప్పట్నుంచి తాగునీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు.

దాహం తీర్చే వారేరీ..?
సోమల: మండలంలోని తమ్మినాయునిపల్లె పంచాయతీ కురవపల్లె, నాయనివారిపల్లె, దళితవాడ సోమల పంచాయతీలోని బీసీ కాలనీ, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తాగునీటి సమస్య రాజ్యమేలుతోంది.  తమ్మినాయునిపల్లె పి.చెరుకువారిపల్లెకు రెండేళ్లుగా తాగునీటి సమస్య ఉంది. బీసీ కాలనీకి నీటి సరఫరా పైపులైన్లు సక్రమంగా లేక, తరచూ బోరు మరమ్మతుకు గురవుతుండడంతో గ్రామస్తులు పొలాల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న బోరు మరమ్మతుకు గురై తహసీల్దార్, ఉపాధి, వెలుగు, గృహనిర్మాణ శాఖ, భవిత  కార్యాలయాలతో పాటు దిడ్డివారిపల్లె గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

తాగునీటి కష్టాలు తప్పేనా..?
శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో పలు ప్రాంతా ల్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పట్టణంలో చెంచులక్ష్మికాలనీతో పాటు కాగితాల హరిజనవాడ, కైలాసనగర్‌కాలనీ, ఎంఎంవాడ తదితర ప్రాంతాల్లో ఇక్కట్లు పడుతున్నారు. శ్రీకాళహస్తి రూరల్‌ ప్రాంతంలో గొల్లపల్లి, మంగళపురి, గుండ్లకండ్రిగ, మేలచ్చూరు, టీఎంవీకండ్రిగ గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఎంవీకండ్రిగలో తరచూ పంచాయితీ మోటార్‌ మరమ్మతులకు గురికావడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏర్పేడు మండలంలోని పాగాలి, పాతవీరాపురం, మోదుగమాల, తొట్టంబేడు మండలంలోని శేషమనాయుడుకండ్రిగ, పిల్లమేడు, కల్లిపూడి, బోనుపల్లి, రేణిగుంట మండలం కరకంబాడి, తారకరామనగర్, రేణిగుంటలో తాగునీటికి కటకటలాడుతున్నారు.

మరిన్ని వార్తలు