సెప్టెంబర్‌ 2న వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ : బొత్స

8 Jul, 2019 18:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సోమవారం విశాఖలో ఉన్న సిటీ సెంట్రల్‌ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టారు. వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కుగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. నామకరణం అనంతరం పార్కులో వైఎస్సార్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ పార్కుకు వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కుగా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్‌ అని ప్రశంసించారు. రాష్ట్రంలో దశల వారిగా ప్రభుత్వం మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అక్టోబర్‌ నాటికి బెల్టు షాపులు ఎత్తి వేయడం జరుగుతుందన్నారు. అమ్మ ఒడి ద్వారా జనవరి 26 నుంచి ఏడాదికి రూ. 15 వేలు చెల్లిస్తామని తెలిపారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.

యూనిక్‌ పార్క్‌గా తీర్చిదిద్దుతాం: బొత్స
వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కును యూనిక్‌ పార్కుగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 2010లో విశాఖ పార్కుకు రోశయ్య వైఎస్సార్‌ పార్కుగా నాయకరణం చేశారని.. తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం దాన్ని సహించలేకపోయిందని మండి పడ్డారు. సెప్టెంబర్‌ 2న వైఎస్‌విగ్రహావిష్కరణ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదవాడికి మేలు జరిగింది అంటే వైఎస్సార్‌ వల్లనే అన్నారు. చదువులో ఏపీ, కేరళతో సమానంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. వైఎస్‌ స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న కార్యక్రమాలను ఆశీర్వదించండి అని కోరారు.

మరిన్ని వార్తలు