ఓటుకు నోటు ఇవ్వమని మోదీ చెప్పారా?

6 May, 2019 15:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబులా బీజేపీ ఎప్పుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 'తప్పుడు ప్రచారంతో రెండు రాష్ట్రాల మధ్య విషం చిమ్మడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మీడియా లేని రోజుల్లో ఏం మాట్లాడినా చెల్లిందేమో, కానీ ఇప్పుడు చెల్లదు. రాహుల్ గాంధీ ఆంధ్రాకు వస్తే రాళ్లతో కొట్టండి అన్నాడు చంద్రబాబు. కర్ణాటకలో మాత్రం విభజన బాగా చేసింది కాంగ్రెసే అన్నాడు. బీజేపీ విభజన చేసిన రాష్ట్రాలు కలిసి మెలిసి ఉన్నాయి. ఓటుకు నోటు ఇమ్మని మోదీ చెప్పారా? రూ. 50 లక్షలు రేవంత్ రెడ్డి ద్వారా పంపమని బీజేపీ చెప్పిందా? డబ్బులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొందాం అని చూసిన దొంగల ముఠా మీది.

2014కి ముందు ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ అని కొనియాడింది మీరే కదా? ఎన్‌డీఏలో 2019లో కూడా మోదీ ప్రధానిగా ఉండాలని మీరే కదా తీర్మానం పెట్టారు. చంద్రబాబు మానసిక స్థితి మీద అనుమానం ఉంది. ఒక బీసీ ప్రధాని ఉంటే ఓర్చుకోలేని దూరహంకారం మీది? బీసీల పార్టీ అని చెప్పుకుంటే సిగ్గుగా లేదా మీకు? సోనియాగాంధీ సమక్షంలో విభజన బాగా జరిగింది అని చెప్పినందుకు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రలో చంద్రబాబు ఓటమి ఖాయం కావడంతో, మా ఎమ్మెల్యేలను కొంటున్నారని కొత్త నాటకం మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వలేదు అని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణము చేసే దమ్ము ఉందా. మీ పార్టీ ఎంపీ దివాకర్‌ రెడ్డి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. రాజకీయాలను డబ్బుల మయం చేసిందే చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే రాజకీయ అనైతికతకు బీజం పోశారు' అని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు