ఏడాదిలో పట్టిసీమ పూర్తయితే సభలో అడుగే పెట్టను!

18 Mar, 2015 02:54 IST|Sakshi
ఏడాదిలో పట్టిసీమ పూర్తయితే సభలో అడుగే పెట్టను!

వైఎస్సార్ సీపీ సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతలపై మంగళవారం అసెంబ్లీలో కొనసాగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ఏడాది గడువులోపల పూర్తి చేస్తే సభలోకి అడుగే పెట్టనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పని ఏదన్నా జరిగిందంటే అది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని మరో సభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు.

పట్టిసీమ జీవోలో రాయలసీమకు నీటి కేటాయింపు విషయం ఎక్కడుందో చెప్పాలని తాము కోరితే.. తామేదో రాయలసీమకే వ్యతిరేకమన్నట్టు మాట్లాడడం కుసంస్కారానికి నిదర్శనం కాదా? అని అధికారపక్షాన్ని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆపిన చర్చను ఆయన మంగళవారం కొనసాగిస్తూ.. ఆ జీవోలో ‘వాటర్‌గ్రిడ్‌లో భాగంగా గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపు’ అనే పదం ఉందే తప్ప రాయలసీమ ప్రస్తావన లేదన్నారు. కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వకుండా రాయలసీమకు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని నిలదీశారు.

సీఎం ఏది చెబితే అది నమ్మడానికి తామేమీ గంగిరెద్దులం కాదన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం తాను ఎలా పోరాడానో తన జిల్లా ప్రజలకు తెలుసునని, తనకు సీఎం గారి సర్టిఫికెట్ ఏమీ అవసరం లేదని తేల్చిచెప్పారు. మొత్తం బడ్జెట్‌లో నీటి పారుదల విభాగానికి రూ. 5 వేల కోట్లు కేటాయించి ఇన్ని ప్రాజెక్టులు ఎలా కడతారో చెప్పాలని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయలసీమకు 13 వేల కోట్లు ఖర్చు చేస్తే బాబు తన 9 ఏళ్ల కాలంలో కేవలం 5 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు తొలిదశ పనులకు మరో వంద కోట్లు కేటాయిస్తే రెండు లక్షల ఎకరాలకు నీరు వచ్చేదని, కానీ బాబు ఆ పని చేయకపోవడమేనా రాయలసీమకు న్యాయం చేయడమంటే అని ప్రశ్నించారు. సర్ ఆర్దర్ కాటన్ తర్వాత గోదావరి డెల్టాకు ఏదైనా మేలు జరిగిందంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు