అయ్యో గ్రీష్మ.. అప్పుడే నూరేళ్లు..!

9 May, 2020 13:01 IST|Sakshi

గ్రీష్మ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు

సాక్షి, అమరావతి : విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో చీకటిని నింపింది. ఈ ఘటనలో గ్రీష్మ అనే తొమ్మిదేళ్ల బాలికను విష వాయువు కబలించింది. హాయిగా నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా మృత్యువు ఆ చిన్నారిని కాటేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి అర్థరాత్రి నిద్రలోనే మృత్యువు ఒడికి చేరుకుంది.
(చదవండి : విశాఖ విషాదం: ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ

ఆర్ ఆర్ వెంకటాపురంకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి గణేష్‌, లత దంపతుల కూతురే గ్రీష్మ. తొమ్మిదేళ్ల గ్రీష్మ నాలుగో తరగతి చదువుతోంది. గ్యాస్ లీకేజ్‌ ఘటన జరిగిన రోజు రాత్రి గ్రీష్మ తల్లిదండ్రులతో కలిసి మేడపై నిద్రించింది. ఆమె పక్కింట్లో ఉండే బాబాయి కుటుంబం గ్యాస్ వాసన వస్తోందని అప్రమత్తమై.. సురక్షిత స్థలానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రీష్మ తండ్రికి ఫోన్ చేశారు. అయితే ఫోన్ తీయకపోవడంతో వాళ్ల ఇంటికి వెళ్లి చూసేసరికి కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు స్పృహ లేకుండా పడి ఉన్నారు. దీంతో అందర్నీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గ్రీష్మ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. గ్రీష్మ తల్లిదండ్రులు, సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: శవాగారం.. శోకసంద్రం)

కాగా, శనివారం ఉదయం గ్రీష్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిన్నారి గ్రీష్మ మృతదేహాన్ని చూసి బంధువులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న తల్లిదండ్రులు తమ బిడ్డను కడసారి చూసేందుకు మార్చురీకి వచ్చారు. తమ బిడ్డ ఇక లేదనే విషాదంతో కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత గ్రీష్మ మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు. (చదవండి : గ్యాస్‌ పీడ విరగడ!)

కాగా, విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను శనివారం అప్పగించారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తుల అంత్యక్రియల్లో మంత్రి అవంతి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్‌ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా