వీఆర్‌ఓ మాయాజాలం..!

11 Sep, 2019 11:49 IST|Sakshi
తమ భూమి ఇదేనంటూ 44లో 7లో భూమి చూపుతున్న కొట్నాన లక్ష్మణరావు

గతంలో తండ్రి.. ప్రస్తుతం కుమారుడు.. ఇద్దరూ వీఆర్‌ఓలే కావడం... వారికి తెలిసినంతగా అమాయకులైన రైతులకు మాయాజాలం తెలియకపోవడంతో వీఆర్‌ఓలైన తండ్రి, కుమారుడు చేతిలో రైతులైన తండ్రి, కుమారుడు ఇద్దరూ మోసపోయారు. ఎప్పుడో 1980, 1981లో పోయిందనుకున్న భూమికి మరో వీఆర్‌ఓ వచ్చి బకాయి ఉన్న శిస్తు చెల్లించాలని కోరడంతో ఇంకా తమ పేరిట రికార్డులలో ఉందని గుర్తించిన రైతు వివరాలన్నీ సేకరించి తమ భూమిని తమకు ఇప్పించాలని స్పందనలో కోరడంతో వీఆర్‌ఓ కుటుంబం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.  వివరాలు ఇలా ఉన్నాయి.

సాక్షి, బొబ్బిలి రూరల్‌: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధిలో వెంకటరాయుడిపేట రెవెన్యూ గ్రామంలో కొట్నాన అప్పలస్వామికి 6–1–1977లో సర్వే నంబరు 44లో 7లో 221ఖాతా నంబరులో 4.55ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం అందించింది. అప్పట్లో 37.56 ఎకరాల పోరంబోకు భూమిని వెంటకరాయుడిపేట రెవెన్యూ గ్రామంలో జగ్గునాయుడు చెరువు వద్ద ఈ ప్రాంత రైతులకు నాటి ప్రభుత్వం అందించింది. అప్పట్లో వీఆర్‌ఓగా పని చేసిన గ్రామానికి చెందిన అప్పలస్వామి సాగు చేసుకుంటున్న భూమికి ఇది నీది కాదని చెప్పడం, అప్పట్లో ఏమీ తెలియని రైతులు తమకు ఇంకా ప్రభుత్వం అందించలేదోమోనని అమాయకంగా వదిలేశారు. ఇదే అదునుగా నాటి వీఆర్‌ఓ తమ బంధువులకు ఆ భూమిని అప్పగించి వారితో సాగు చేయించారు.

కాలక్రమేణా అప్పలస్వామి మరణించడం, వీఆర్‌ఓ మారిపోవడం, వీఆర్‌ఓ కుమారుడు వీఆర్‌ఓ కావడం, అప్పలస్వామి కుమారుడు లక్ష్మణరావు వ్యవసాయం చేçస్తుండడం జరిగాయి. ఇటీవల గ్రామానికి వచ్చిన కొత్త వీఆర్‌ఓ పొలానికి శిస్తు బకాయి  కట్టాలని కొట్నాన లక్ష్మణరావును కోరడంతో అనుమానం వచ్చి వీఆర్‌ఓ, సర్వేయరు ద్వారా వివరాలు సేకరించగా భూరికార్డులన్నీ తమ తండ్రి అప్పలస్వామి పేరిట 2008 వరకు ఉండడం, తరువాత ఆ భూములు వేరొకరి పేరిట మారడం గుర్తించిన లక్ష్మణరావు ఇటీవల స్పందనలో కలెక్టర్, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇటీవల వీఆర్‌ఓ, ఆర్‌ఐ ఎవరి సంతకాలు లేకుండా నేరుగా అప్పటి తహసీల్దార్‌ ఆమోదంతో పోరంబోకు భూములు జిరాయితీలుగా వేరొకరి పేరిట బదిలీ కావడం, ఆన్‌లైన్‌లో కూడా మారిపోయాయి.

తమ తండ్రి అప్పలస్వామి ఎప్పుడో చనిపోయాడని, తన తండ్రి కానీ, తాము కానీ భూములు ఎవరికీ అమ్మలేదని, తనఖా పెట్టలేదని కొట్నాన లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కారకుడు గ్రామానికి చెందిన వీఆర్‌ఓగా గుర్తించారు. ఆ వీఆర్‌ఓ బంధువుల పేరిట భూములు ఉండడం గమనించిన అధికారులు వీఆర్‌ఓపై చర్యలకు నివేదికలు పంపారు. కాగా సదరు వీఆర్‌ఓను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరిటగాని, తన భార్య పేరిటగాని ఎలాంటి భూములు లేవని, ఎవరు ఏం చేసుకుంటారో.. ఏం రాసుకుంటారో రాసుకోండని సమాధానం చెప్పాడు. కాగా ఈ వీఆర్‌ఓ ఆస్తుల కోసం తండ్రినే చూడడం లేదని, గతంలో వీఆర్‌ఓగా పని చేసిన తండ్రే ఈ వీఆర్‌ఓపై స్పందనలో ఫిర్యాదు చేయడం, డీఆర్‌ఓ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లోనే ఈ వీఆర్‌ఓను నిలదీయడం విశేషం.

న్యాయం చేయాలి...
నా తండ్రి అప్పలస్వామి పేరిట మాకు 1977లో 4.55ఎకరాల భూమి అప్పట్లో ప్రభుత్వం అందించింది. మాయ మాటలు చెప్పి మాకు పొలం రాలేదని మా నాన్నకు చెప్పి  స్థానిక వీఆర్‌ఓ కుటుంబం మోసం చేసింది. మా నాన్న చనిపోవడంతో మేం పట్టించుకోలేదు. ఇటీవల గ్రామానికి మరో వీఆర్‌ఓ వచ్చి భూమి శిస్తు బకాయి అడగడంతో నాకు సందేహం వచ్చి వివరాలు ఆరా తీశాను. స్పందనలో ఫిర్యాదు చేశాను. సర్వేయరు వచ్చి పరిశీలించారు. తహసీల్దార్‌ న్యాయం చేస్తామన్నారు.  మాకు న్యాయం చేయాలి.
–  కొట్నాన లక్ష్మణరావు, బాధిత రైతు, దిబ్బగుడ్డివలస

చర్యలకు సిఫార్సు...
అన్యాయం జరిగింది వాస్తవమే. స్థానికంగా ఉన్న వీఆర్‌ఓ పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అసలు పోరంబోకు భూమి ఎలా ఇంకొకరి పేరిట ఆన్‌లైన్‌లోకి వచ్చిందో అర్ధం కాలేదు. దీనిపై స్పందనలో ఫిర్యాదు రావడంతో సర్వే చేపట్టి వాస్తవాలు కనుగొన్నాం. 1977నాటి భూమి కదా. కొద్ది సమయం పడుతుంది. ఈ గందరగోళానికి బాధ్యుడైన  వీఆర్‌ఓపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసాం. దీనిపై కలెక్టర్‌కు ఫ్యాక్స్‌ చేస్తా...
– పి.గణపతిరావు, తహసీల్దార్, బొబ్బిలి

మరిన్ని వార్తలు