వరి వేయాలా.. వద్దా..!

8 Aug, 2018 08:50 IST|Sakshi
రాజుపాళెం మండలం వెలవలిలో నారుమడిలో చల్లిన పులక

రాజుపాళెం (వైఎస్సార్‌ కడప): రాజోలి నుంచి మెదలయ్యే కేసీ కాలువ ఆయకుట్టు పరిధిలో రైతులకు సాగునీటిపై అధికారులు ఏ విషయం చెప్పలేకపోతున్నారు. అన్నదాతలేమో వరినారు కయ్యలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటినుంచి డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో 876 అడుగుల నీటిమట్టం ఉందని, ఆయకట్టు పరిధిలో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు. నాలుగైదు రోజులుగా నారుదొడ్డి చేసుకుంటూ, వట్టి వడ్లు, పులక చల్లుకుంటున్నారు. గత నెల 29న ప్రధాన కాలువకు, ఈనెల 1న కేసీ చాపాడు కాలువలకు ఆశాఖ అధికారులు, డీసీ చైర్మన్‌లు నీటిని విడుదల చేశారు.

కేసీ చాపాడు కాలువ కింద రాజుపాళెం, ప్రొద్దుటూరు, చాపాడు మండలాలు, కేసీ ప్రధాన కాలువ కింద కర్నూలు జిల్లా చాగలమర్రి, వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాళెం, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, వల్లూరు మండలాలు కలిపి దాదాపు 92 వేల ఎకరాల ఆయకుట్టు ఉంది. ఇప్పటికే రాజపాళెం మండలంలోని వెలవలి, తొండలదిన్నె, టంగుటూరు, వెంగళాయపల్లె, రాజుపాళెం, పగిడాల, గాదెగూడూరు గ్రామాల్లోని రైతులు వరి నారుకయ్యలు తయారు చేసుకొని పులక చల్లుతున్నారు. ఎకరా వరి పంట సాగు చేయాలంటే విత్తనవడ్లు రూ.900, ఎరువు, కూలీల ఖర్చు రూ.500, ఎద్దులకు రూ.400 కలిపి రూ.1800 నుంచి రూ.2200 ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. గత మూడేళ్లేగా సాగునీరు లేకపోవడంతో కేసీ ఆయకట్టు వరి  సాగుకు నోచుకోవడం లేదు.

వరి సాగు చేయొద్దు
ఈక్రమంలో కర్నూలు జిల్లాల్లోని ఉన్నతాధికారులు కేసీ ఆయకట్టు కింద వరిపంట వేయొద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో నారుదొడ్లలో పులక చల్లిన రైతుల్లో ఆందోళన నెలకొంది.

మూడేళ్లుగా ఆరుతడి పంటే సాగు
కేవలం ఆరుతడి పంటలైన మినుము, పెసర, శనగ, జొన్న పంటలనే రైతులు సాగు చేసుకోవాల్సి వస్తోంది.అక్కడక్కడా పత్తి సాగవుతోంది. మాగాణి భూముల్లో వరి సాగు చేసుకోవాల్సిన రైతులకు ప్రతిఏటా సాగునీటి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నప్పటికి మంత్రి, అధికారులు కేసీ ఆయకట్టు పరిధిలో సాగునీటిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం రాజోలి ఆనకట్ట నుంచి కేసీ చాపాడు కాలువకు 200, కేసీ ప్రధాన కాలువకు 600, కుందునదిలోకి 2900 క్యూసెక్కులు నీరు పోతోంది.

10 ఎకరాలకు పులక చల్లాను
నేను పది ఎకరాల్లో నారుదొడ్డిలో పులక చల్లాను. అధికారులు మాత్రం డిసెంబరు 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతులంతా కాలువలకు నీరు రావని అనుకుంటున్నారు. ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోంది. ఏంచేయాలో తెలియడం లేదు. అధికారులు కేసీ కాలువ కింద వరి పంట సాగుపై ప్రకటన ఇవ్వాలి.    – పద్మనాభరెడ్డి, రైతు, వెలవలి, రాజుపాళెం మండలం

స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి
నేను ఇరవై ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారుకయ్యలను సిద్ధం చేసి పులక, వడ్లు చల్లాను. కాలువకు నీటిని విడుదల చేసేటప్పుడు అధికారులు డిసెంబరు నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు.  కర్నూలు జిల్లాలోని అధికారులు మాత్రం వరిపంట సాగు చేయవద్దంటున్నారు. గత మూడేళ్లుగా వరిపంట వేయలేదు. – చెన్నంగి ఎర్రన్న, రైతు, తొండలదిన్నె, రాజుపాళెం మండలం

మరిన్ని వార్తలు