యూటీ అంటే యుద్ధమే

22 Sep, 2013 02:27 IST|Sakshi
యూటీ అంటే యుద్ధమే

సాక్షి, హైదరాబాద్:  హైదరాబాద్‌ను యూటీ అని కిరికిరి చేస్తే యుద్ధమేనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఓయూ జేఏసీ నేతలతో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించాలనే ప్రతిపాదనతో ఓయూ జేఏసీ నేతలు శనివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. అయితే.. అక్టోబర్ మొదటి వారంలోనే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముందని, ఆ తరువాతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయించుకుందామని కేసీఆర్ సూచించారు. ‘ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతనే ఉద్యమ కార్యాచరణపై మాట్లాడుకుందాం. ఎవరెన్ని ప్రయత్నాలు, కుట్రలు చేసినా 10 జిల్లాలతోనే తెలంగాణ వస్తుందనుకుంటున్నా.
 
 

అయితే హైదరాబాద్‌పైనే కేంద్రం కిరికిరి పెడుతుందేమోనని అనుమానం వస్తున్నది. యూటీ అనే నేరుగా చెప్పకుండా శాంతి భద్రతలు, రెవెన్యూలో సీమాంధ్రకు వాటా వంటి పేచీ పెడ్తారేమో. ఇవి కూడా మన అనుమానాలే. హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరి పెట్టినా అంగీకరించేది లేదు. గల్లీ నుండి ఢిల్లీ దాకా అన్ని ప్రజా ఉద్యమాలను, విద్యార్థులను ఏకం చేద్దాం. తెలంగాణకు ఏ నష్టం జరిగినా పెద్దయుద్ధమే వస్తది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కొంచెం ఓపికతో చూద్దాం. ఏమన్నా జరిగితే విద్యార్థులే ముందుండి ఉద్యమాన్ని నడిపించాలె. లక్షమందితో నిజాం కాలేజీలోనే విద్యార్థి గర్జన పెట్టుకుందాం. భూకంపమే సృష్టిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌తో సమావేశమైన వారిలో ఓయూ జేఏసీ నేతలు, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి కిశోర్‌కుమార్, పల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తుంగ బాలు, రాకేష్, మర్రి అనిల్, దుర్గం భాస్కర్, కందుల మధు, శంకర్ నాయక్, వడ్డె ఎల్లన్న, వెంకటేశ్, అంజిబాబు, అంజి యాదవ్, సంతోష్, రహీం, యాకయ్య తదితరులు ఉన్నారు.
 
 సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాసపై దాడి
 
 సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాక.. తెలంగాణ యాస, భాష, సంస్కృతిపై భయంకరమైన దాడి జరిగిందని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకూ జిల్లాల్లో తెలంగాణ జాగృతి నిర్వహించబోయే ‘బంగారు బతుకమ్మ’ పోస్టర్‌ను తెలంగాణభవన్‌లో కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో హీరోలకు ఆంధ్రా భాషను పెట్టి.. విలన్లు, జోకర్లు, వ్యాంప్‌లతో తెలంగాణ యాసతో మాట్లాడిస్తున్నారని, ఇది దారుణమని విమర్శించారు. ప్రాంతాలను బట్టి వివిధ మాండలికాలు ఉంటాయని చెప్పారు. ఒకే జిల్లాలో కూడా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య మాండలిక వ్యవహారాల్లో తేడాలుంటాయన్నారు. ఆంధ్రాలో బుల్లబ్బాయి అనే పేరు ఉంటుందని, హైదరాబాద్‌లో ఆ పేరుతో పిలిస్తే దవడ పగలగొడతారని చెప్పారు. బుల్లబ్బాయి అనేది తెలంగాణలో బూతులా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల్లో న్యూనతాభావం కల్పించేలా భాష, యాస, సంస్కృతిపై  దాడి చేశారని చెప్పారు. ఉర్దూ పుట్టిన గడ్డ తెలంగాణ అని, ఈ ప్రాంతంలో తెలుగు, ఉర్దూ చెట్టాపట్టాలేసుకున్నాయని అన్నారు. ఆంధ్రా వారికి హిందీ రాదని, బ్రిటిష్ వారి ప్రభావంతో ఆంగ్లం తప్ప తెలంగాణ మాండలికాలపై అవగాహన లేదని వివరించారు. టీవీలు, సినిమాల ప్రభావం పెరిగిపోయిన తర్వాత సంస్కృతి, మాండలికాలు దెబ్బతిన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ.. బంగారు బతుకమ్మ పేరుతో అన్ని తెలంగాణ జిల్లాల్లో 4 నుంచి 12 వరకూ బతుకమ్మలని నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, మాజీ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు