ఎవరిపై యుద్ధానికి వార్ రూం?

25 May, 2014 01:02 IST|Sakshi
ఎవరిపై యుద్ధానికి వార్ రూం?

టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు ప్రశ్న
వార్ రూం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కనుమరుగైంది
అవసరమైతే నేను కూడా వార్ రూంకు వస్తా
ఇష్టప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు
ఉద్యోగుల వివరాలన్నీ ప్రజల ముందుంచాలి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో వార్ రూంను ఎవరిపై యుద్ధం చేయటానికి ఏర్పాటు చేశారని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వార్ రూం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అవసరమైతే ఉద్యోగులకు అండగా తాను కూడా వార్ రూంకు వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఎవరు కూడా తమ ఇష్టప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఆయన శనివారం ఎన్‌టీఆర్ భవ న్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సింది ప్రశాంత వాతావరణం, అభివృద్ధే తప్ప వార్ రూంలు కాదన్నారు. అయిదారు రోజుల నుంచి టీఆర్‌ఎస్ నేతల ప్రవర్తన, మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. వారు అభివృద్ధి విషయంలో పోటీ పడాలని సూచించారు.
 
  ఇంకా ఆయనేమన్నారంటే...
 
 గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు ఆయనతో ఉన్న చనువు వల్ల నేను తెచ్చిన నిధుల వల్లే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ వచ్చింది. నేను హైదరాబాద్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చాను. తెలంగాణ నేతలు తమ వ్యాఖ్యలతో ఇప్పటికే దాన్ని పాడుచేశారు, ఇంకా పాడు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి మాటల వల్ల తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు నష్టపోతారు.
 
 తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి కేసీఆర్ ప్రతి ఒక్కరిని కాపాడాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా మాట్లాడినా అధికారంలోకి వచ్చినపుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదు. తప్పుడు ప్రచారంతో రెచ్చగొడితే గట్టిగా సమాధానం చెప్తాం.
 
 ఉద్యోగులందరికీ న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరి వివరాలు ప్రజల ముందు ఉంచాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే కేంద్రం సరిదిద్దాలి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ తదితర హామీలకు కట్టుబడి ఉన్నాను.
 
 విభజన ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటివరకు నాకు అంతుపట్టలేదు. ఇప్పుడు అధికారులు వివరించటంతో కొంత బోధపడింది. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మోడీ రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. మంచిరోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తా.
 
 అలిపిరి వద్ద నాపై దాడి చేసిన గ ంగిరెడ్డిపై ఉన్న కేసులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీరుగార్చారు. గంగిరెడ్డి విదేశాలకు వెళ్లినా పోలీసులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారు. తిరుపతిలో కబ్జాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగింది. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల తిరుమల సంద ర్శించినపుడు పోలీసులను కోరాను.
 
 బాబుకు పలువురి అభినందన
 
 తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు శనివారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి అభినందించారు. అభినందనలు తెలిపిన వారిలో చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, సినీ నటులు రాజశేఖర్, జీవిత, రమ్యశ్రీ, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్, నేతలు వరలక్ష్మి, పద్మావతి, సునంద, ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్  ఛైర్మన్ ఎం. జనార్ధనరెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం కన్వీనర్ ఎండీ నాగభూషణం, బాలాజీ స్కాన్ ఎండీ ఆలూరి లలిత, ఏపీ టూరిజం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్  వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి. వీరారెడ్డితో పాటు వివిధ సంఘాల నేతలున్నట్లు పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
 
 చంద్రబాబును అభినందించిన అమితాబ్ బచ్చన్
 
 ఎన్నికల్లో మంచి విజయం సాధించిన చంద్రబాబును బాలీవుడ్ సినీనటుడు అమితాబ్ బచ్చన్ శనివారం అభినందించారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తనను అభినందించిన అమితాబ్‌కు చంద్రబాబు ట్విట్టర్‌లో కృత జ్ఞతలు తెలిపారు. ఆయన మాటలు తమకు మరింత ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధికి తాము కృషి చేస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

>
మరిన్ని వార్తలు