తెల్లకార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం

9 Jun, 2015 23:51 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: జూన్ నెల వచ్చిందంటే ఏటా తహశీల్దార్, మీసేవా కేంద్రాల చుట్టూ విద్యార్థులు తిరుగాల్సిన ఇబ్బందులు  ఇక తప్పనున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రం స్థానంలో ఇక తెల్లకార్డునే అనుమతించి ధ్రువీకరణ చేసుకోవాలని భూపరిపాలన శాఖ ముఖ్య  కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఆదేశాలు జారీ చేశారు. అలాగే  రైతులకు కూడా పంట, భూ రుణాలపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కోరవద్దని స్టేట్‌లెవెల్ బ్యాంకర్ల కమిటీ ద్వారా  బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. వారికి కూడా ఆదాయ ధ్రు వీకరణ పత్రంగా తెల్ల రేషన్ కార్డును గుర్తించాలని సీసీఎల్‌ఏ జీఓ విడుదల చేసింది.
 
  తక్షణం ఈ ఆదేశాలను ఆయా తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు అమలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి నాలుగేళ్ల కాలపరిమితితో ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని సూచించారు. ఇందుకు తగిన కొత్త ఫార్మాట్‌ను  విడుదల చేశారు. ఈ ఫార్మాట్ లో  దరఖాస్తు దారుని ఆధార్‌నంబర్ కాలమ్‌తో సహా కొత్తగా రూపొందించారు. అదేవిధంగా అధికాదాయ వర్గా ల వారికి జీవిత కాల ధ్రువీకరణను ఇస్తారు. జీవితాంతం ఇదే ధ్రువీకరణ వర్తిస్తుందని జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా ఆదాయ ధ్రు వీకరణ పత్రం అవసరం లేదని జీఓలో పొందుపరిచారు.
 
 అనర్హుల సంగతేంటి?
 ఆదాయ ధ్రువీకరణ పత్రంగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం బాగానే ఉంది కానీ, ఈ విధానాన్ని కొందరు అధికాదాయ వర్గాల వారు దుర్వినియోగం చేసుకుని అందరిలానే తమకూ బీపీఎల్ ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ వేలాది మంది అధికాదాయ వర్గాల వారికి తెల్ల రేషన్ కార్డు ఉంది. పెద్ద పెద్ద భవంతులను అద్దెలకు ఇచ్చే వారితో పాటు నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేవారు కూడా తెల్ల కార్డును పొంది  ఉన్నారు.
 
  అయితే ఈ తరహా ప్రయోజనాలు కేవలం బీపీఎల్ కుటుంబాలకే కలిగించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు సలహా ఇస్తున్నారు. జిల్లాలో అన్నపూర్ణ, ఏఏవై కార్డులతో పాటు 6,42,490 బీపీఎల్ రేషన్ కార్డులున్నాయి. ఇందులో దాదాపు 50వేలకు పైగా సంపన్నులకు తెల్ల రేషన్ కార్డులున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరితో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తల్లి దండ్రులకు కూడా తెల్ల రేషన్ కార్డులే ఉన్నాయి. మరి తెల్ల రేషన్ కార్డును ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తిస్తే ఇక ఇటువం టి వారికి కూడా వర్తిస్తుందని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు