ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు?

26 Jun, 2013 17:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ను ఎప్పుడు జారీ చేస్తారో, వివిధ విద్యా సంస్థల్లో ఫీజులను ఎప్పుడు నోటిఫై చేస్తారో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు మంగళవారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సభ్య కార్యదర్శి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఎంసెట్ కన్వీనర్‌లను ఆదేశించింది. ఈ నెలాఖరులోగా అటు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ, ఇటు ఫీజులను నోటిఫై ప్రక్రియను పూర్తి చేస్తారో లేదో చెప్పాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈ నెల 28 నాటికి తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ, ఏఎఫ్‌ఆర్‌సీకి మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాక అధికారుల చర్యల వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుందని, ఇది ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు.
 
 2013-14 విద్యా సంవత్సరానికి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేయలేదని, వెంటనే ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా ఏఎఫ్‌ఆర్‌సీ, ఉన్నత విద్యాశాఖలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు నేహ, కార్తీక్‌రెడ్డి, మీనా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే వివిధ విద్యా సంస్థల్లో ఫీజులను వెంటనే నోటిఫై చేసేలా ఆదేశించాలంటూ నేహ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ మంగళవారం విచారించారు. ఇంజనీరింగ్ ప్రవేశాలన్నీ అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్దేశించిన షెడ్యూల్‌కు లోబడి జరగాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, శ్రీహర్షారెడ్డి కోర్టుకు నివేదించారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఈనెల 19 నాటికి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందని, మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ అధికారుల చర్యల వల్ల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవుతోందని, దీని ప్రభావం మొత్తం విద్యా సంవత్సరంపై ఉంటుందని విన్నవించారు. ఫీజులను నోటిఫై చేసే విషయంలో కూడా అటు ఏఎఫ్‌ఆర్‌సీ, ఇటు ఉన్నత విద్యాశాఖ ఆలస్యం చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మార్చి మొదటి వారానికల్లా ఫీజులను నోటిఫై చేయాలని గతంలో ఏఎఫ్‌ఆర్‌సీకి హైకోర్టు స్పష్టం చేసినా ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నం జరగలేదన్నారు. ఫీజులు నోటిఫై చేయడానికి మరో పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని ఏఎఫ్‌ఆర్‌సీ న్యాయవాది వివరణ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు