విభజన నిర్ణయాన్ని ఎందుకు చించరు?:సీమాంధ్ర నేతలు

3 Oct, 2013 16:20 IST|Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్ కోర్ కమిటీ, ప్రధాని మంత్రి, కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్నే చించేశారని, తెలంగాణ విభజన నిర్ణయాన్ని ఎందుకు చించరని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో  సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రితో వారు గంటకుపైగా సమావేశమయ్యారు. అంతకు ముందు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై చర్చలు జరిపారు. సీఎంతో జరిగిన సమావేశంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ నోట్ వస్తుందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందని తాను అనుకోవడంలేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని చెప్పారు.  అందరం ఒకే అభిప్రాయంతో ముందుకు వెళదామన్నారు. మీ అభిప్రాయాలను అధిష్టానినికి వివరిస్తానని చెప్పారు. మరోసారి మన అభిప్రాయాలను గట్టిగా వినిపిద్దామన్నారు.

అధిష్టానం మన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తుందని విమర్శించారు.  రెండు సార్లు అత్యధిక మెజార్టీతో ఎంపి స్థానాలను ఇచ్చాం, మనమెందుకు ఢిల్లీ వెళ్లాలి? అని ప్రశ్నించారు. ఢిల్లీలో సాయంత్రం ఏం జరుగుతుందో చూసిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దామని సిఎం చెప్పారు.

>
మరిన్ని వార్తలు