తెలంగాణలో పర్యటిస్తే.. సీఎంనూ అరెస్టు చేస్తారా?

1 Nov, 2013 04:14 IST|Sakshi

* నల్లగొండ జిల్లా పర్యటనను అడ్డుకోవడంపై విజయమ్మ ఆగ్రహం
 
సాక్షి, ఖమ్మం: ‘నేను సమైక్యవాదిని అంటున్నారు.. మరి సీఎం తనకు తానే సమైక్యవాదినని ప్రకటించుకుంటున్నారు.. ఆయన తెలంగాణ జిల్లాలో పర్యటిస్తే అరెస్టు చేస్తారా..?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సరిహద్దులో విజయమ్మను అదుపులోకి తీసుకొని నేలకొండపల్లి స్టేషన్‌కు తరలించిన అనంతరం  ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు.

‘ఇదేమైనా పాకిస్తానా.. బంగ్లాదేశా..? మేమేమైనా రౌడీషీటర్లమా..? వీసా తీసుకొని తెలంగాణలో పర్యటించాలా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఇంకా ఎక్కడైనా ఉన్నామా.. ప్రభుత్వమే నాపర్యటను అడ్డుకుంటోంది’ అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ వారిని పలకరించకుండా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. తాము వెళ్తుంటే కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారన్నారు.

‘ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి మాట ఇవ్వడం నేతల కర్తవ్యం.. ఇది నేను చేయడం తప్పా.. మనం ప్రజాస్వామంలో ఉన్నామా.. ఇంకెక్కడైనా ఉన్నామా’ అని ప్రశ్నించారు. కొంతమంది నాయకులు, పార్టీలు కుట్రలు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హ రిస్తున్నారన్నారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తెలంగాణ ప్రజల గోడు పట్టించుకున్నారు.. కానీ ఈ ప్రభుత్వానికి జనం గోడు పట్టదా’ అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో పర్యటనను ప్రజలు అడ్డుకోవడం లేదని, ప్రభుత్వం, ఇక్కడి నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వం, ఆయన కష్టంతో మంత్రి పదవులు తెచ్చుకున్న మంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.  

మళ్లీ నల్లగొండకు వస్తాం.. రైతులను కలుస్తాం..
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే నాయకులను ఎవ్వరూ ఆపలేరని, మళ్లీ నల్లగొండకు వచ్చి బాధిత రైతులను కలుస్తామని విజయమ్మ చెప్పారు.
 
నల్లగొండ ఎస్పీని ఫోన్‌లో నిలదీసిన విజయమ్మ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తుపానుతో పంటలు నష్టపోయి బాధలో ఉన్న రైతులను పరామర్శించడానికి వస్తే రాజకీయం చేస్తారా..? ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, ప్రజల కోసం పనిచేసే పార్టీలు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలవడానికి రాకుంటే ఎపుడు వస్తారు? మేమేమన్నా దాడులు చేయడానికి వస్తున్నామా? మమ్మల్ని ఎందుకు వెనక్కి వెళ్లిపొమ్మంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధిత రైతులను పరామర్శించాకే వెళతాం. రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’ అని నల్లగొండ ఎస్పీ ప్రభాకరరావును వైఎస్ విజయమ్మ ఫోన్‌లో నిలదీశారు. నల్లగొండ జిల్లాకు వెళ్లకముందు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండగా ఆమె ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

నల్లగొండ జిల్లాకు అనుమతించబోమని పోలీసులు అనడంపై మండిపడ్డారు. బాధల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఈ విషయం గమనించకుంటే ఎలా..? అంటూ ఎస్పీని ప్రశ్నించారు. ‘మాకు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ.. మూడు ప్రాంతాలు సమానమే, అయినా రైతులతో రాజకీయం ఏమిటి? నేనైతే వస్తున్నా.. రక్షణ కల్పిస్తారో.. వెంట ఉండి రాళ్లు వేయిస్తారో.. మీ ఇష్టం..’ అని అన్నారు. కాగా, ఎస్పీతో మాట్లాడిన అర్ధగంట తర్వాత వైఎస్ విజయమ్మ పార్టీ నేతలతో మాట్లాడి, బాధిత రైతులను పరామర్శించేందుకు ముందు నిర్ణయించిన మార్గంలోనే వెళ్లడానికి నేలకొండపల్లి నుంచి బయలుదేరారు. పోలీసులు ఆమెను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు