విపక్షం లేకుండానే

4 Sep, 2015 04:00 IST|Sakshi

ప్రత్యేక కోర్టుల బిల్లు ఆమోదం
ప్రతిపక్షం వాకౌట్ చేసిన వెంటనే బిల్లులకు ఆమోదం
 సాక్షి, హైదరాబాద్: విపక్షం లేకుండానే కీలకమైన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు బిల్లు సహా తొమ్మిది బిల్లులను శాసనసభ గురువారం ఆమోదించింది. తూతూమంత్రంగా బిల్లులు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షం వాకౌట్ చేసిన తర్వాత.. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రత్యేకకోర్టుల ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై స్వల్పచర్చ అనంతరం ఆమోదిస్తున్నట్టు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు.
 జూదశాలలు పెట్టండి:
 విష్ణుకుమార్‌రాజు(బీజేపీ) డిమాండ్
 గుర్రపు పెందాలపై ఏపీ నుంచి చాలామంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని, హైదరాబాద్‌లోని రేస్‌క్లబ్ బెట్టింగ్ మొత్తాన్ని వసూలు చేస్తున్న దృష్ట్యా పన్నుల్లో ఏపీ వాటా చెల్లించడానికి వీలుగా తీసుకొచ్చిన ‘ఏపీ గుర్రపు పందేలు, పందెపు పన్ను వినిమయం-1358 ఫస్లీ’ సవరణ బిల్లును ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై జరిగిన స్వల్పచర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ... ఏపీలో క్యాసినోలు(జూదశాలలు) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్యాసినోలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి యనమల చెప్పారు. బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. థార్మిక, హిందూ సంస్థల, ఎండోమెంట్ సవరణ బిల్లు, నీటి సంఘాల సవరణ బిల్లు, శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను రెండోసవరణ బిల్లు,వ్యవసాయ మార్కెట్ చట్టం సవరణ బిల్లు, కార్మిక చట్టాల సవరణ బిల్లులను సభ  ఆమోదించింది.
 వాకౌట్‌పై చేసిన విమర్శలే..
 దేవాదాయ బిల్లుపై చర్చలు

 విపక్షం వాకౌట్ చేసిన తర్వాత దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు దేవాదాయ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. టీటీడీ పాలకమండలిలో తుడా(తిరుపతి అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ) చైర్మన్‌కు స్థానం కల్పించాల్సిన అవసరం లేదంటూ దేవాదాయ చట్టం-1987కు సవరణ చేయడం ఈ బిల్లు లక్ష్యం. మంత్రి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. టీడీపీ సభ్యులు ప్రభాకర్‌చౌదరి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి చర్చలో పాల్గొని.. విపక్షం వాకౌట్ చేయడంపై విమర్శలు చేశారు. దేవాదాయ చట్టసవరణ గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. కానీ చర్చ తర్వాత బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదం లభించినట్లు స్పీకర్ ప్రకటించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు