మిస్‌ వైజాగ్‌ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ

10 Dec, 2017 12:28 IST|Sakshi

ఫైనల్‌కు వెళ్లొద్దని మంత్రి గంటాకు విజ్ఞప్తి

సానుకూలంగా స్పందించని మంత్రి

అడ్డుకుని తీరతామంటున్న మహిళా సంఘాలు

సాక్షి, విశాఖపట్నం : మిస్‌ వైజాగ్‌ అందాల పోటీల వివాదం తారాస్థాయికి చేరుకుంది. నేటి సాయంత్రం ఫైనల్స్‌ ఉన్న నేపథ్యంలో పోటీలను అడ్డుకునేందుకు మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. 

ఈ ఏడాదికి గానూ నిర్వాహకులు 26 మంది యువతులను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌ ఫైనల్స్‌ పోటీ నిర్వహించబోతున్నారు. దీనికి మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు గంటాను కలిసి పోటీలను రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు పోటీలకు వెళ్లొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి మాత్రం అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతాననటం గమనార్హం. 

మిస్‌ వైజాగ్‌ పోటీలపై ప్రారంభం నుంచే వివాదాలు నెలకొన్నాయి. పోటీల ఆడిషన్స్‌ జరుగుతున్న సమయంలో కూడా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించినప్పటికీ.. ఎలాంటి స్పందన లేకుండా పోయిందని మహిళా సంఘాలు వాపోతున్నాయి. అత్యాచారాలు జరిగినపుడు నిందితులను చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, మహిళలపై నిరంకుశ విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన మంత్రి ఆధ్వర్యంలోనే అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటని వారంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహణను అడ్డుకుని తీరతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు