విశ్వాస ఘాతకుడు కేఈ

16 Dec, 2018 14:12 IST|Sakshi
బలపాలపల్లెలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

రెవెన్యూ డివిజన్‌ హామీ మరిచారు 

డోన్‌ ప్రజలను మోసం చేశారు 

పీఏసీ చైర్మన్‌ బుగ్గన ధ్వజం 

డోన్‌: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విశ్వాస ఘాతకుడని డోన్‌ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నట్లు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జిల్లాపరిషత్‌ అతిథి గృహంలో శనివారం ప్యాపిలి, డోన్‌ జెడ్పీటీసీ సభ్యులు దిలీప్‌ చక్రవర్తి, శ్రీరాములుతో కలిసి బుగ్గన విలేకరులతో మాట్లాడారు.   తనను మాజీ ఎమ్మెల్యేగా చేయడమే జీవిత లక్ష్యమని ఇటీవల కేఈ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తాను మాజీ కావాలంటే ప్రజల చేతుల్లో ఉందే తప్ప.. కేఈ కుటుంబీకుల చేతుల్లో లేదనే వాస్తవాన్ని డిప్యూటీ సీఎం గ్రహించకపోవడం విచారకరమన్నారు. స్థాయి దిగజారి మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఆయన మానసికస్థితి ఏమిటో అర్థమవుతోందన్నారు.  

ఏరుదాటాక బోడిమల్లన్న... 
ఆరుసార్లు ఎమ్మెల్యేగా కేఈని గెలిపించి.. రాష్ట్రంలో అత్యున్నత పదవి చేపట్టేందుకు కారణమైన డోన్‌ ప్రజలను డిప్యూటీ సీఎం నట్టేట ముంచారని బుగ్గన విమర్శించారు. డోన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి.. తన కుమారుడిని ఎమ్మెల్యేగా చేసేందుకు పత్తికొండకు మకాం మార్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేరన్నారు. కేఈ వైఖరి ఏరుదాటక ముందు ఏరుమల్లన్న ఏరుదాటక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని వ్యంగ్యోక్తులు విసిరారు. 

ఈ పాపం మీది కాదా? 
పట్టణంలో నాయీబ్రాహ్మణుల బేస్‌మట్టాలను దౌర్జన్యంగా ఆక్రమించి టీడీపీ నాయకులు ఇళ్లు కట్టుకున్న విషయంపై కేఈ ఏనాడైనా నోరు మెదిపారా అని బుగ్గన నిలదీశారు. గంగపుత్రుల మాన్యాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకులను మందలించిన పాపాన పోలేదన్నారు. టైలర్స్‌ కాలనీ, పేరంటాలమ్మ, మాన్యం భూముల్లో నిరుపేదలు నిర్మిస్తున్న బేస్‌ మట్టాలను దౌర్జన్యంగా తొలగించడంపై కేఈ ఎందుకు మాట్లాడడంలేదో సమాధానం చెప్పాలన్నారు. సాయిబాబా గుడి స్థలంలో కొంతభాగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించి ఆ సొమ్మును గుడి నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నామని ప్రకటించడం వాస్తవం కాదా అన్నారు. ఇవన్నీ చాలవంటూ శివారు ప్రాంతా ల్లోని వంకలు, వాగులను సైతం టీడీపీ నాయకు లు ఆక్రమిస్తుంటే కేఈ ఎందుకు అడ్డుకట్ట వేయలేదని బుగ్గన ప్రశ్నించారు. టెండర్ల కోసం కక్కుర్తిపడి విపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులను టీడీపీ నాయకులు దారుణంగా చంపేందుకు ప్రయత్నిస్తే కేఈ నోరు మెదపలేదన్నారు.   డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే చేసిన తప్పులను అంగీకరించి నియోజకవర్గ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. 

అవినీతి పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయి..
బేతంచెర్ల: టీడీపీ అవినీతి పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  బలపాలపల్లె  గ్రామంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.  ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు వర్షాలు పడవన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి  చర్యలు తీసుకుంటామని    హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తుజావలి, మండల కన్వీనర్‌ సీహెచ్‌ లక్ష్మీరెడ్డి, గ్రామ నాయకులు పొట్టారెడ్డి, సుబ్రమణ్యం, ఎద్దులన్న,  తిమ్మయ్య , పార్టీ నాయకులు బుగ్గన  నాగభూషణం రెడ్డి ,  చంద్రారెడ్డి,   బాబుల్‌రెడ్డి,  బుగ్గన ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు