ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి

13 Mar, 2015 02:24 IST|Sakshi
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి
  • మనిషి పెరిగితే ఏం లాభం అచ్చెన్నాయుడికి జగన్ చురకలు
  • సాక్షి, హైదరాబాద్: సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, విపక్షాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చురకలంటించారు. అందర్నీ నవ్వుల్లో ముంచెత్తిన ఈ వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదికైంది. ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంపై చర్చ జరుగుతున్న సందర్భంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని ఉన్నప్పటికీ.. అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ సమస్యను దారిమళ్లించేందుకు ప్రయత్నించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జగన్... ‘అధ్యక్షా... మీరు (ప్రభుత్వం) ఒక్క ఇల్లూ కట్టలేదు. కట్టుకున్నవాళ్లకు ఇంతవరకు బిల్లులు కూడా రాలేదు.

    ఇప్పటికే ఏడాది గడిచి పోయింది. జియో ట్యాగింగో, ఇంకోటో... ఇంకోటో అంటూ ఏడాది గడిచింది. ఇప్పుడు మరో ఏడాదో, రెండేళ్లో గడపడానికి హౌస్ కమిటీ అంటున్నారు. అసలు ఒకటే అడుగుతున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్‌గా పని చేసిన శిల్పా మోహన్‌రెడ్డిని మీ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది మీరు కాదా? నిజంగా అవినీతి జరిగుంటే మీరెందుకు టిక్కెట్ ఇచ్చారు? మేము గత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు.

    మద్దతు తెలిపింది మీరు. కిరణ్ సర్కార్‌ను కాపాడింది మీరు. మేము దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డికి వారసులమని గొప్పగా చెప్పుకుంటామే గానీ కాంగ్రెస్‌కు కాదు. మీరు ఇప్పటికీ ప్రతి విషయంలోనూ ఊ.. అంటే సంబంధిత మంత్రి కాకపోయినా... ఎత్తుగా, లావుగా, భద్రంగా ఉన్నాడని అచ్చెన్నాయుడికి మైకు ఇస్తారు. (బల్లలు చరుస్తూ సభ్యుల హర్షధ్వానాలు.. నవ్వులు) ఆయనేమో ఎత్తుగా, లావుగా, భద్రంగా ఉన్నాడు కాబట్టి గట్టిగట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. మనిషేమో పెరుగుతున్నాడు... కానీ ఏమి లాభం.. మనిషి పెరిగే కొద్దీ వొదిగి ఉండాలి.

    మానవత్వం బయటకు రావాలి. కానీ అవేవీ లేవు.. (ఈ దశలో మైక్ కట్ అయ్యింది. తిరిగి మైకు ఇచ్చిన తర్వాత జగన్ మాట్లాడారు.) అధ్యక్షా.. ఇటువంటి వ్యక్తులు ఇంత దారుణమైన మాటలు మాట్లాడే ముందు మానవత్వం తెలుసుకోవాలి. అంత అహం మంచిది కాదు...  చేయాల్సిన పనులు తెలుసుకోవాలి..’ అని అన్నారు. దీనికి సంబంధించి సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మరిన్ని వార్తలు