‘నవరత్నాలు.. గాంధీజీ ఆశయాలకు ప్రతీక’

26 Feb, 2020 21:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, హరిజన, గిరిజన జనోద్ధరణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో సాకారమవుతున్నాయని గాంధీపథం పక్ష పత్రిక ఎడిటర్‌ ఎన్‌.పద్మజ అన్నారు. గాంధీపథం పక్ష పత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా ‘గాంధీజీ స్వప్నం- వైఎస్‌ జగన్‌కే సాధ్యం’ పేరుతో రూపొందించిన ప్రత్యేక సంచికను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేశరు. ఈ సందర్భంగా గాంధీపథం పక్ష పత్రిక ఎడిటర్‌ పద్మజ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా గాంధీజీ సిద్ధాంతాలతో ఈ పత్రిక నడుస్తుందని తెలిపారు. స్వాత్రంత్య పోరాటంలో మహాత్మా గాంధీ ఎంచుకున్న మార్గాన్ని అనుసరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలు, వివిధ దీక్షలు, సమస్యలపై ప్రజలపక్షాన పోరాడిన తీరు ప్రశంసనీయమన్నారు. (సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ)

గాంధీజీ ఆశయాలతో సీఎం జగన్‌ చేపడుతున్న పాలనను.. ‘గాంధీజీ స్వప్నం- వైఎస్‌ జగన్‌కే సాధ్యం’ అన్న పేరుతో సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేశామని ఆమె తెలిపారు. నవరత్నాల్లో ప్రతిరత్నం గాంధీజీ ఆశయాలకు ప్రతీకగా అమలవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సంచిక సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉందని పద్మజ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోటశ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు